Jagan: సుప్రీంకోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ.. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
ABN , Publish Date - Jan 19 , 2024 | 01:45 PM
ఏపీ సీఎం జగన్ రెడ్డికి(YS Jagan Mohan Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది.
ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ రెడ్డికి(YS Jagan Mohan Reddy) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేశారని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ కేసులో తాము రాజకీయ పరమైన అంశాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ బెయిల్ రద్దు కేసు విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటని, దీనికి బాధ్యులు ఎవరని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. డిశ్చార్జ్ పిటిషన్లను విచారించడానికి ఎందుకంత సమయం తీసుకున్నారని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది.
అయితే విచారణ జాప్యంలో, వాయిదాల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా సీబీఐకి సంబంధం లేకపోతే వేరే ఎవరికి సంబంధం ఉంటుదని ప్రశ్నించారు. సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసును జాప్యం చేస్తున్నారని ఈ సందర్భంగా పిటిషనర్ ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ఆరోపించారు. దీంతో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతవరకు కేసుల విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఆలస్యం ఎందుకు అవుతుందో చెప్పాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.