Share News

Chandrababu: ఒక్క చాన్స్‌తో మాఫియా రాజ్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:03 AM

ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో సీఎం జగన్‌ కులచిచ్చు పెట్టాలని చూశాడని టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఒక్క చాన్సిస్తే రాష్ట్రాన్ని మాఫియా రాజ్‌ చేశారని.. మళ్లీ అవకాశమిస్తే రాష్ట్రం ఖాళీ అయిపోతుందని హెచ్చరించారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని, జగన్‌ పాలనలో వారికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.

Chandrababu: ఒక్క చాన్స్‌తో మాఫియా రాజ్‌

మరో చాన్స్‌ ఇస్తే రాష్ట్రం ఖాళీ: చంద్రబాబు

‘శాంతి’ సీమలో కులచిచ్చు.. సిద్ధం అంటున్న జగన్‌కు ఇక యుద్ధమే

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ గర్జన.. కోనసీమలో ఉమ్మడి సభలు

జగన్‌ ఎక్స్‌పైరీ సీఎం.. ఆయనది జగన్నాటకం

అధికారమిస్తే మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు

పగ్గాలిస్తే దోపిడీకి లైసెన్స్‌గా మార్చుకున్నాడు

మళ్లీ గెలిస్తే ప్రజలను చంపేసి డోర్‌ డెలివరీ

ఆయన ఉదయం టిఫిన్‌గా తినేది ఇసుక

మధ్యాహ్న భోజనం మద్యం.. రాత్రి తినేది గనులు

సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌ను తరిమికొట్టాలి: చంద్రబాబు

కాకినాడ/అమలాపురం/అంబాజీపేట, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో సీఎం జగన్‌ కులచిచ్చు పెట్టాలని చూశాడని టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు (Chandrababu), పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఒక్క చాన్సిస్తే రాష్ట్రాన్ని మాఫియా రాజ్‌ చేశారని.. మళ్లీ అవకాశమిస్తే రాష్ట్రం ఖాళీ అయిపోతుందని హెచ్చరించారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని, జగన్‌ పాలనలో వారికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కులమతాలు దాటి, ప్రాంతాలు దాటి, జిల్లాస్థాయి దాటి ఆలోచించకపోతే అందరం నష్టపోతామని హెచ్చరించారు. గురువారం సాయత్రం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట సెంటర్‌, రాత్రికి అమలాపురంలో జరిగిన ప్రజాగళం ఉమ్మడి బహిరంగ సభల్లో వారిద్దరూ ప్రసంగించారు. జగన్‌ విధ్వంస పాలనలో దళితులు తీవ్రంగా నష్టపోయారని.. వారిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రిది జగన్నాటకమని.. చేతికి అధికారం ఇస్తే మాపియా సామ్రాజ్యం నడిపాడని.. పాలించమని పగ్గాలు కట్టబెడితే దోపిడీకి లైసెన్స్‌గా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. ఆయన ఇప్పుడు ఎక్స్‌పెయిరీ సీఎం అని మండిపడ్డారు.

ఆయన ఉదయం అల్పాహారం కింద తినేది ఇసుక అయితే.. మధ్యాహ్న భోజనం కింద మద్యం, రాత్రి భోజనం కింద గనులు తినేసి రాష్ట్రం మొత్తాన్ని దోచేశారని విమర్శించారు. మళ్లీ గెలిపిస్తే ఈసారి ప్రజలను చంపేసి ఇళ్లకు డోర్‌ డెలివరీ చేస్తాడని హెచ్చరించారు. సిద్ధం అంటున్న సీఎం జగన్‌కు ఇక యుద్ధమేనని చంద్రబాబు అన్నారు. ‘కోనసీమలో గన్నవరం గర్జించింది. ఇది గోదావరి గర్జన.. ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దంపట్టే స్పందన ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు లాంఛనమే. మనమే గెలుస్తున్నాం. మన ఆడబిడ్డల స్పందన చూస్తుంటే, వీర మహిళలైతే ఎప్పుడు పోలింగ్‌ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గాజుగ్లాసుకు ఓటేసి తద్వారా జగన్‌ గుండెల్లోకి గుచ్చేందుకు చూస్తున్నారు. నేను పవన్‌ కల్యాణ్‌ వచ్చింది మీకు భరోసా కల్పించేందుకే.. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకే! సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌ను తన్ని తరిమికొట్టాలి. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఆయన్ను లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ టీడీపీ. ముగ్గురు మహానుభావులు బాబూ జగ్జీవన్‌రామ్‌, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్‌ జయంతి జరిగే నెల ఇది. వారి సాక్షిగా హామీ ఇస్తున్నా. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.200 ఉండే కరెంటు చార్జీలు ఇప్పుడు వైసీపీ హయాంలో రూ.2 వేలయ్యాయా లేదా?

సూపర్‌డూపర్‌ హిట్‌..

రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన, టీడీపీ కలిశాయి.. వీటికి బీజేపీ తోడైంది. మేం కలిసి వచ్చామంటే సూపర్‌డూపర్‌ హిట్‌. ఎవరైనా అడ్డంగా వస్తే తొక్కుకుంటా పోతాం. జగన్‌ ఒక అహంకారి. ఏపీని సర్వనాశనం చేశాడు. చివరకు ప్రజలను బెదిరించి వారి ఆస్తులను మెడపై కత్తి పెట్టి రాయించుకుంటున్నాడు. పట్టాదారు పాసుపుస్తకాల దగ్గర నుంచి సర్వేరాళ్ల వరకు ఫోటోలు వేయించుకున్నాడు. మాట్లాడితే బటన్‌ నొక్కాను అంటున్న జగన్‌ మద్యపాన నిషేధం అమలుపై ఎందుకు నొక్కలేదు? సీపీఎస్‌ రద్దు, డీఎస్సీపై ఎందుకు నొక్కలేదు? ఆయన్ను మళ్లీ సీఎంను చేస్తే రాష్ట్రంలో ఏమీ మిగలదు. అందుకే రాష్ట్రంలో ఉన్న అరాచకశక్తిని సాగనంపాలి. చిరంజీవి చిత్రసీమలో రారాజు. ఎన్నో గొప్ప అవార్డులు అందుకున్న గొప్ప వ్యక్తి. డైరెక్టర్‌ రాజమౌళి కూడా ఎంతో కీర్తిగడించారు. అలాంటి వ్యక్తులను జగన్‌ ఇంటికి పిలిపించి అవమానించారు. ఆయనకు సంస్కారం లేదు. కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చుండబెట్టిన అనే సామెత ఊరికే రాలేదు. టీడీపీ, జనసేన కలవక ముందు జగన్‌ దింపుడు కళ్లం ఆశతో ఉన్నారు. ఓట్లు చీలి లాభపడతామనుకున్నారు. కానీ పొత్తు కుదిరాక ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రావు. రొయ్యల పిల్లలకు పట్టే వైరస్‌ కంటే వైసీపీ వైరస్‌తోనే ఆక్వాకు నష్టం.

కోనసీమ అందాలసీమ..

కోనసీమ అందాలసీమ.. మంచినీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు. అటువంటి మంచి మనసున్న కోనసీమలో జమ్ముకశ్మీరు మాదిరిగా అల్లర్లు సృష్టించి ఇంటర్నెట్‌ బంద్‌ చేయించారు. ప్రజల మధ్య విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టిన దుర్మార్గుడు జగన్‌. గోదావరి జిల్లాలో చిచ్చుపెట్టి చలికాచుకోవాలని చూస్తున్నాడు.

కాపులకేదీ సాయం?

కాపుల్లో కూడా పేదలున్నారు. వారి కోసం ఏడాదికి రూ.1,000 కోట్లు ఖర్చుపెట్టాం. వారి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చుపెడతానని ప్రగల్భాలు పలికిన జగన్‌.. కనీసం రూ.10 కోట్లయినా ఖర్చు చేశాడా? మీరు కొట్టే దెబ్బతో జగన్‌రెడ్డికి అదిరిపోవాలి. హలో ఏపీ... బై బై జగన్‌.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 12 , 2024 | 07:57 AM