TTD Board Members List: టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే..
ABN , Publish Date - Nov 01 , 2024 | 08:39 PM
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మెంబర్ల పూర్తి జాబితాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 243 జారీ చేశారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మెంబర్ల పూర్తి జాబితాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 243 జారీ చేశారు. టీటీడీ మెంబర్లుగా చైర్మన్‌తో కలిపి 25 మందితో బోర్డు ఏర్పాటు చేశారు. వీరితో పాటు నలుగురు ఉన్నతాధికారులను ఎక్స్‌ఆఫీషియో మెంబర్లుగా నియమించారు. ఒక స్థానాన్ని పూరించకుండా ప్రభుత్వం ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆస్థానానికి కూడా సభ్యుడిగా ఈరోజు బీజేపీ నేత జి భాను ప్రకాష్ రెడ్డి పేరు ఖరారు చేశారు. పూర్తిస్థాయి టీటీడీ బోర్డును ప్రకటిస్తూ నేడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చైర్మన్: బొల్లినేని రాజగోపాల నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే
జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి- కోవూరు ఎమ్మెల్యే, ఎంఎస్‌రాజు-మడకశిర ఎమ్మెల్యే, పనబాక లక్ష్మి-కేంద్ర మాజీ మంత్రి, నన్నూరి నర్సిరెడ్డి-తెలంగాణ, సాంబశివరావు (జాస్తి శివ)-ఎన్‌ఆర్‌ఐ, నన్నపనేని సదాశివరావు-ఫార్మా, సుచిత్రా ఎల్లా-ఫార్మా, కృష్ణమూర్తి-తమిళనాడు కోటేశ్వరరావు-రాజమండ్రి, మల్లెల రాజశేఖర్ గౌడ్-టీడీపీ, జంగా కృష్ణమూర్తి-టీడీపీ, దర్శన్ ఆర్‌ఎన్-కాఫీ వ్యాపారి, జస్టిస్ హెచ్‌ఎల్‌దత్తు-మాజీ సీజేఐ, పి.రామ్మూర్తి-తమిళనాడు, తమ్మిశెట్టి జానకీదేవి-టీడీపీ, బి.మహేంద్రరెడ్డి-జనసేన, అనుగొల్లు రంగశ్రీ-జనసేన, బి.ఆనంద్‌సాయి-జనసేన కోటా, నరేష్ కుమార్-కర్ణాటక, శాంతరామ్-కుప్పం పారిశ్రామికవేత్త, డా.అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్ బోరా-ఆర్థిక నిపుణుడు
25 మంది సభ్యులతో టీటీడీ బోర్డు..
25 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిలో మొత్తం 25 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం కల్పించారు. ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం.
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కొత్త పాలక మండలిని నియమించారు. మొత్తం 25 మందితో టీటీడీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల నాయుడును బోర్డు చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన 24 మందిని సభ్యులుగా నియమించింది. బోర్డులో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్టులో స్థానం లభించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసిన వ్యక్తిని తొలిసారి టీటీడీ బోర్డులో నియమించారు. మాజీ సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును బోర్డు సభ్యుడిగా నియమించారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. మొత్తం 23 మంది సభ్యుల్లో ముగ్గురు మహిళలకు అవకాశం లభించింది.
టీడీపీ నుంచి...
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌రాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి బోర్డులో స్థానం దక్కింది. తొలి నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న తెలంగాణకు చెందిన నన్నూరి నర్సిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. రాజమండ్రికి చెందిన సాధారణ వ్యక్తి కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది. నంద్యాల జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా క్రిష్ణమూర్తికి అవకాశం దక్కింది. ఎన్నికల్లో క్రిష్ణమూర్తి గురజాల ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు. మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవిని సభ్యురాలిగా నియమించారు.
జనసేన కోటాలో...
జనసేన పార్టీ కోటాలో ముగ్గురికి టీటీడీ బోర్డులో అవకాశం లభించింది. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డిని సభ్యుడిగా నియమించారు. 2009 నుంచి ఆయన జనసేనాని వెంటే ఉన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి టీటీడీలో చోటు కల్పించారు. ఆమె భర్త ఎం.సి.దాస్ జనసేన పార్టీ ట్రెజరర్‌గా ఉన్నారు. ఇక జనసేన పార్టీ కోటాలో డిప్యూటీ సీఎం పవన్ సన్నిహితుడు, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్‌సాయికి అవకాశం దక్కింది. తెలంగాణలోని యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇక ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి జాస్తి సాంబశివరావు, ఫార్మా రంగం నుంచి నన్నపనేని సదాశివరావు, సుచిత్ర ఎల్లాకు బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది. అమిత్‌షా సతీమణి, కృష్ణమూర్తి సతీమణి చిన్ననాటి స్నేహితులని సమాచారం. కృష్ణమూర్తి మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. కాఫీ వ్యాపారి ఆర్‌ఎన్ దర్శన్, కుప్పం పారిశ్రామిక వేత్త శాంతరామ్, చెన్నైకి చెందిన పి.రామ్మూర్తిని సభ్యులుగా నియమించారు. పి.రామ్మూర్తి తమిళనాడులో పెద్ద టెక్స్‌టైల్స్ వ్యాపారవేత్త. కర్ణాటక నుంచి నరేష్‌కుమార్‌కు చోటు కల్పించారు. ఆర్థిక నిపుణుడు, నిధుల సమీకరణలో అనుభవం ఉన్న సౌరబ్ హెచ్.బోరాకు బోర్డు సభ్యుడిగా స్థానం దక్కింది. గతంలో ఎంసీఐ చైర్మన్‌గా విధులు నిర్వహించిన కేతన్ దేశాయ్ కుమారుడు డాక్టర్ అదిత్ దేశాయ్‌కు బోర్డులో స్థానం లభించింది. కేతన్‌పై ఆరోపణలుండడంతో ఆయనకు బదులుగా అదిత్ దేశాయ్‌కు అవకాశం కల్పించారు.
మళ్లీ అవకాశం
టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమితులైన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి గత వైసీపీ హయాంలోనూ బోర్డులో ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలోనూ బోర్డులో స్థానం దక్కించుకున్న సౌరభ్ బోరా.. ఇప్పుడు మరోసారి టీటీడీ సభ్యుడయ్యారు. ఇక ప్రస్తుతం టీటీడీ సభ్యుడిగా నియమితులైన రామ్మూర్తి సోదరుడు తిరుప్పూర్ బాలు గతంలో బోర్డు సభ్యుడిగా పని చేశారు. కేతన్ దేశాయ్ వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండగా... ఇప్పుడు ఆయన కుమారుడు అదిత్ దేశాయ్‌కి అవకాశం లభించింది.
ప్రభుత్వానికి ధన్యవాదాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తమను నియమించడంపై పలువురు సభ్యులు స్పందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కొత్త సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిచండం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి సేవలో తరించడానికి దొరికిన గొప్ప అవకాశం ఇదని పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జ్యోతుల నెహ్రు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు టీటీడీ బోర్డు ద్వారా వెంకన్న భక్తులకు మరింత ఉన్నత సేవలు అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రతి భక్తుడికి వెంకన్న సులభ దర్శనం జరిగేలాగా బోర్డు ద్వారా చర్యలు చేపడతామని జ్యోతుల నెహ్రు వెల్లడించారు.