Share News

AP News: నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్థీవదేహం.. పలువురు ప్రముఖుల నివాళి

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:32 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

AP News: నారావారిపల్లికి రామ్మూర్తి  నాయుడు పార్థీవదేహం.. పలువురు ప్రముఖుల నివాళి

తిరుపతి: నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహం చేరుకుంది. స్విమ్స్ అంబులెన్స్‌లో రేణిగుంట విమానాశ్రయం నుంచి నారావారిపల్లికి చేరుకుంది. ఈరోజు(ఆదివారం) ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహాన్ని తీసుకుని వచ్చారు. పార్థివ దేహంతో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర బంధువులు వచ్చారు. నారావారి పల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి చంద్రబాబుతో పాటు నారావారిపల్లికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ వచ్చారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ రోజు రాత్రి నారావారిపల్లెలోనే చంద్రబాబు ఉండనున్నారు. రేపు తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది.


నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు సినీ నటులు నివాళులర్పించారు.చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు,, సినీనటులు మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్ సి.రాధాకృష్ణన్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్. కలికిరి మురళీమోహన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మంచి మిత్రున్నీ కోల్పోయా: రాజేంద్రప్రసాద్

నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడుకు సినీ నటులు రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు. ‘‘మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు. మేమిద్దరం ఎప్పటినుంచో మంచి స్నేహితులం. మంచి రాజకీయ ఆదర్శ నాయకుడు. రాజకీయంగానే కాకుండా ఆయన మంచి మనసు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు. ఆయన లేని లోటు కుటుంబానికే కాదు ప్రజలందరికీ తీరని లోటు’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.


డప్పు కొట్టి నారా రామ్మూర్తి నాయుడుకి మంద కృష్ణ నివాళి

mandakrishna-madiga.jpg

1997లో నారావారిపల్లి నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నారా రామ్మూర్తి నాయుడు ఇంట్లోకి పిలిచి అప్యాయంగా చూసుకున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మందకృష్ణ మాదిగ ప్రత్యేకంగా మాట్లాడారు.‘‘మమ్మల్ని ఎవరు ఇంట్లోకి రానీయరు, అలాంటి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ల తల్లిదండ్రులు ఆశీస్సులు ఇప్పించి పంపారని గుర్తుచేసుకున్నారు. ఆయనకు డప్పుకొట్టి నివాళి అర్పించానని మందకృష్ణ మాదిగ తెలిపారు.

Updated Date - Nov 17 , 2024 | 01:50 PM