Share News

CM Chandrababu: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 22 , 2024 | 08:31 PM

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు

అమరావతి: తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆదివారం రాత్రి అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయం ముసుగులో ఓ క్రిమినల్ తిరుగుతున్నాడని బాబు ఆక్షేపించారు. అందుకే మాజీ సీఎం జగన్‌ను ఎస్కోబార్ అని అంటారని తెలిపారు. చేసిన తప్పును సమర్థించుకుంటూ ప్రధాని మోదీకి లేఖ రాయడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు.

కడుపు రగిలిపోతోంది..

"తిరుమల పవిత్రతను దెబ్బ తీసి ప్రధాని మోదీకి లేఖ రాసి సమర్థించుకుంటున్నారు. నిన్నటి నుంచి వైసీపీ నేతలు ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోంది. టీటీడీ చైర్మన్‌గా చేసిన వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుంది. మరో మాజీ చైర్మన్ భూమన తన ఇంట్లో పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు మతసామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురు దాడి చేస్తే ఎలా. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3.75లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చారు. జగన్‌ను సంఘ బహిష్కరణ చేయాలి. ప్రధానికి రాసిన అన్ని అబద్ధాలే. నేరస్థుడు, ఉగ్రవాదైన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జస్టిఫికేషన్ కూడా ఆయనే ఇస్తున్నారు. జగన్‌ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి" అని బాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 08:44 PM