During Jagan's Regime : పేదల గూడుకు జగన్ గ్రహణం
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:06 AM
సొంతిల్లు... ప్రతి పేదవాడి కల. రానురాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లూ పాడుపెట్టారు
గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు
3.19 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం
2019 నాటికి దాదాపుగా పూర్తి
జగన్ సర్కారు రాగానే పనుల ఆపివేత
చంద్రబాబుకు క్రెడిట్ దక్కరాదన్న అక్కసుతో టిడ్కో ఇళ్లను శిథిలావస్థకు చేర్చిన వైనం
ఎన్నికల ముందు హడావుడిగా కొన్ని పూర్తి
వాటికి కూడా వసతులు కల్పించకుండా వైసీపీ రంగులేసి వదిలేశారు
ఇప్పుడైనా పూర్తిచేయాలని లబ్ధిదారుల ఆశ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
సొంతిల్లు... ప్రతి పేదవాడి కల. రానురాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణం) (పీఎంఏవై) పథకం- అందరికీ ఇళ్లు (అఫార్డబుల్ హౌస్ ఫర్ ఆల్) కింద రాష్ట్రానికి దాదాపు 7 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 3.19 లక్షల ఇళ్లు పట్టణ పేదలకు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 2014-19 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణాలు ఓ కొలిక్కి వచ్చాయి. స్వల్ప పనులు తప్ప దాదాపు పూర్తయ్యాయి. అయితే 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడటం పేదలకు శాపంగా మారింది. టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే రాజకీయ దురుద్దేశంతో నిర్మాణాలను ఆపేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. మూడేళ్ల పాటు వాటి గురించి పట్టించుకోలేదు. ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు మొరపెట్టుకున్నా వినలేదు. అయితే ఎన్నికల ముందు టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జగన్ సర్కారు ఉత్తుత్తి హడావుడి చేసింది. అది కూడా పేరుకు అతి కొద్ది నిర్మాణాలను పూర్తి చేసింది. వాటికి వైసీపీ రంగులేసి వదిలేసింది. తాగునీరు, రోడ్లు వంటి కనీస వసతులు కూడా కల్పించలేదు. దీంతో ఆ ఇళ్లలో లబ్ధిదారులు ఉండలేని పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో చాలా వరకు టిడ్కో ఇళ్ల సముదాయాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో లబ్ధిదారుల ఆశలు మళ్లీ చిగురించాయి. ఇప్పటికైనా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరుతున్నారు. నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. పలు ప్రాంతాల్లో పట్టణాలకు దూరంగా ఇళ్ల సముదాయాలు ఉండడంతో రవాణా, మార్కెట్, పాఠశాలలు, రేషన్ సరఫరా తదితర సౌకర్యాలు కల్పించాలి.
మౌలిక వసతులు ఏవీ?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు విడతల్లో 52,318 టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. 30,672 ఇళ్ల నిర్మాణాలు 85-90 శాతం పూర్తయ్యాయి. చాలా వరకు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న సమయంలో.. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆగిపోయాయి. ఆ ఇళ్ల గోడలకు వైసీపీ రంగులు వేసి వదిలేశారు. కర్నూలు జిల్లాలో 16,595 ఇళ్లు పూర్తయ్యాయి. అందులో 5,616 లబ్ధిదారులకు అప్పగించగా.. 150 ఇళ్లలో కూడా లబ్ధిదారులు చేరలేదు. తాగునీరు, రోడ్లు వంటి కనీస మౌలిక వసతులను వైసీపీ ప్రభుత్వం కల్పించకపోవడమే కారణం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పలు ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముళ్ల కంప పొదలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
40 కోట్ల బిల్లులు పెండింగ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడ్కో ఇళ్ల సముదాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెరిగాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 50,914 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 70 శాతం నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 34,642 టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. కేవలం 16,272 మందికి ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. అవి కూడా పూర్తి చేయలేదు. తాడిపత్రి పరిధిలో 5,184 ఇళ్లకు గానూ 370 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. కాంట్రాక్టర్లకు రూ.40 కోట్లకుపైగా బిల్లులను పెండింగ్ పెట్టింది. దీంతో ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారు.
జగన్ సొంత జిల్లాలోనూ...
మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు దాదాపు పూర్తయినా మౌలిక వసతులు లేవు. కడపలో 992 ఇళ్లు, ఎర్రగుంట్లలో 1584 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రోడ్లు, డ్రైనేజీ, గృహాల నుంచి మురుగునీరు సరఫరా అయ్యే కాల్వలు, విద్యుత్ ఇతర మౌలిక వసతులు లేవు. జమ్మలమడుగులో 1440 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఫ్లోరింగ్, ఇతరత్రా పనులు నిలిచిపోయాయి. విద్యుత్ లైన్లు లేవు. ప్రాంగణమంతా ముళ్లపొదలతో నిండిపోయింది. కడపలో మౌలిక వసతుల కోసం 2022లో జగన్ ప్రభుత్వంలో రూ.11.49 కోట్లతో టెండర్లు పిలిచినా పనులు పూర్తి చేయలేదు.
అసంపూర్తిగానే...
గత టీడీపీ ప్రభుత్వంలో గ్రేటర్ విశాఖ పరిధిలో 31 లేఅవుట్లలో 24,192 టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. వాటిలో దాదాపు 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో 2019 ఎన్నికలకు ముందు అర్హులైన లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ ఇళ్ల కేటాయింపులను రద్దు చేసింది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. 30,083 మందిని అర్హులుగా గుర్తించింది. కానీ 24,192 ఇళ్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో 24,192 మందికి లాటరీ ద్వారా కేటాయించింది. 2024 ఎన్నికలు సమీపించేసరికి ఆగమేఘాల మీద చివరిదశలో నిలిచిపోయిన భవనాలకు తుది మెరుగులు దిద్ది 7,456 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అప్పగించారు.
అతీగతీ లేదు
శ్రీకాకుళం జిల్లాలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు అతీగతీ లేదు. శ్రీకాకుళం అర్బన్ ప్రజల కోసం పాత్రునివలస వద్ద నిర్మించిన 1,280 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. 500 మంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్లలో నివాసం ఉంటున్నారు. రెండో ఫేజ్ కింద ఇక్కడ నిర్మాణం చేపట్టిన 624 ఇళ్లు 80 శాతం పూర్తయ్యాయి. ఆమదాలవలసలో 528, ఇచ్ఛాపురంలో 192, పలాసలో 912 ఇళ్ల నిర్మాణాలు 70 శాతం మేర పూర్తయ్యాయి. ఇదంతా 2019లోనే జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఇళ్లూ లేవు... సొమ్మూ లేదు
పార్వతీపురం మన్యం జిల్లాలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరలేదు. పార్వతీపురం పురపాలక సంఘానికి చెందిన 336 మంది టిడ్కో ఇళ్ల కోసం సుమారు రూ.కోటి 75 లక్షలు చెల్లించారు. వైసీపీ సర్కారు నిర్వాకంతో వారికి ఇళ్లు అప్పగించకపోగా.. కట్టిన డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదు. దీంతో వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరు పట్టణంలో టిడ్కో గృహ సముదాయాల్లో విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. అత్యధికులు గృహ ప్రవేశాలు కూడా చేయలేదు.
తలుపులూడి.. చెదలు పట్టి
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 11,374 గృహాలను మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇంట్లోను గృహప్రవేశం జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఈ గృహాలను గాలికొదిలేసింది. మౌలిక వసతులు కల్పించలేదు. వినియోగానికి నీటి సరఫరా లేదు. తలుపులు, టాయిలెట్‌లు చాలా వరకు చెదలుపట్టి శిథిలమయ్యాయి.
పూర్తికాకుండానే కేటాయింపులు
ఎన్టీఆర్ జిల్లాలో టిడ్కో గృహాలు ప్రస్తుతం 11 వేలు ఉన్నాయి. లబ్ధిదారులందరికీ అలాట్‌మెంట్ పత్రాలు ఇచ్చినా, నివాసయోగ్యంగా లేకపోవటంతో ఈ ఇళ్లలోకి ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో గృహా నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వ హయంలో కేవలం 10 శాతం తప్పితే ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఐదేళ్ల కిందట టిడ్కో ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.
రూ.342 కోట్లు కావాలి
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను గత టీడీపీ ప్రభుత్వం 60 శాతం పూర్తి చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయాయి. నిధులు కేటాయించకుండానే లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాటిని నవరత్నాలకు మళ్లించింది. దీంతో పేదల సొంతింటి కల నెరేవేరలేదు. ఇంటిపై ప్రభుత్వం తీసుకున్న రుణానికి నెలనెలా వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో లబ్ధిదారులు దిచ్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 7,200 మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు. ఐదేళ్లపాటు నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు రూ.342.29 కోట్లు అసరమని అధికారులు అంచనా వేశారు.
నిలువెత్తు నిర్లక్ష్యం
విజయనగరం జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం గురించి వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు నిర్లక్ష్యం చూపించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2023 నవంబరు, డిసెంబరులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో మార్పులు, చేర్పులు చేసి అందజేసింది. రోడ్లు, కాలువలు, విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. దీంతో లబ్ధిదారులు ఆ ఇళ్లకు వెళ్లలేదు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి.
సమస్యల హారం
పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను గత వైపీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కాంట్రాక్టర్లకు సొమ్ములు ఇవ్వలేదు. ఇప్పటికీ రూ.150 కోట్లు బకాయిలున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో 20,512 టిడ్కో ఇళ్లు కేటాయించగా, గత తెలుగుదేశం ప్రభుత్వం 75 శాతం నిర్మాణాలను పూర్తి చేసింది. దాదాపు 8,500 ఇళ్లను పూర్తి చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల వరకు ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. రెండేళ్ల క్రితం లబ్ధిదారులకు అప్పగించినా ఇళ్లలోకి వెళ్లడానికి వారు ఆసక్తి చూపడం లేదు. మూడు పట్టణాల్లోనూ అప్పగించిన ఇళ్లలో దాదాపు ఐదు వేల మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. మంచినీరు, లీకేజీ, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఇంకా 12 వేల ఇళ్లు అప్పగించాల్సి ఉంది.
ఇంకా 5536 ఇళ్లు పెండింగ్‌లోనే...
గత టీడీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో 13,712 టిడ్కో గృహాల నిర్మాణాలను ప్రారంభించింది. అందులో 8176 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా, ఇంకా 5536 ఇళ్లను పెండింగ్‌లో పెట్టారు. ఇందులో 65 శాతం మేర నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తగిన మౌలిక వసతులు కూడా కల్పించలేదు. కొందరు లబ్ధిదారుల పేర్లను మార్చేశారు. కొన్నిచోట్ల వివిధ కారణాలతో గృహాల సంఖ్యను కుదించారు.
శిథిలావస్థలో...
తూర్పుగోదావరి జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల టిడ్కో గృహాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా ఇళ్ల నిర్మాణాలను దాదాపు పూర్తి చేసినప్పటికీ, తర్వాత వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసింది. నిడదవోలులో రెండో దశలో మొదలెట్టిన 1152 ఇళ్లు, కొవ్వూరులో 480 ఇళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మౌలిక సదుపాయాలు లేవు. నిడదవోలులో పూర్తిగా శ్లాబ్‌లు కూడా వేయలేదు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.
ఇంకా పూర్తికావాల్సినవి 10,236
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 32,304 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఇప్పటి వరకూ 22,068 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. గుంటూరు నగరంలోని వెంగళాయపాలెంలో ఫేజ్-2 కింద 1,392 ఇళ్లు, సత్తెనపల్లిలో 160 ఇళ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. సత్తెనపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గుంటూరులో ఇళ్లకు రంగులు వేయాల్సి ఉంది. తెనాలిలో ఫేజ్- 2 కింద 1,008, చిలకలూరిపేటలో 1,008, రేపల్లెలో 1,344, వినుకొండలో 1,440, పిడుగురాళ్ల కొండమోడులో 2,832, మాచర్లలోని గొర్రెలమండీలో 1,056 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. గుంటూరు అడవితక్కెళ్లపాడులో లబ్ధిదారులకు ఇచ్చిన టిడ్కో ఇళ్లు సమస్యలమయంగా ఉంది. అక్కడ నివసిస్తున్న 4,192 కుటుంబాలు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నాయి.
అడవులను తలపించేలా...
పల్నాడు జిల్లాలోని మున్సిపాలిటీల్లో టిడ్కో ఇళ్ల ప్రాంగణాల్లో మౌలిక వసతులు లేవు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజి, రోడ్లు తదితర సమస్యలు ఉన్నాయి. ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అనేక ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు బూజు పట్టగా, ప్రాంగణాలు పిచ్చి చెట్లతో అడవులను తలపిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో అయితే ఇనుప చువ్వలు తుప్పు పట్టిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినా తగిన సదుపాయాలు లేవు.