Share News

AP Elections 2024: టెన్షన్‌.. అటెన్షన్‌!

ABN , Publish Date - May 25 , 2024 | 04:28 AM

ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ పూర్తయిన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్‌ మొదలైంది.

AP Elections 2024: టెన్షన్‌.. అటెన్షన్‌!

  • కౌంటింగ్‌ ఏర్పాట్లపై పార్టీల దృష్టి

  • ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్‌!

  • కౌంటింగ్‌ సమయంలో గోల్‌మాల్‌..

  • జరగకుండా చూసేందుకు అటెన్షన్‌!

  • నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులకు ఆదేశం

  • టూర్లు ముగించుకుని తిరుగు ప్రయాణం

  • పోస్టల్‌ బ్యాలెట్‌, ఫామ్‌-17సీపై ఫోకస్‌

  • మండల స్థాయి నేతలతో సమీక్షలు

ఇదీ ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. ఎన్నికల ప్రచారం, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది అభ్యర్థులు తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్లారు. సాధారణంగా అయితే.. కౌంటింగ్‌కు ఒకటి రెండురోజుల ముందు దాకా ఇలాగే కొనసాగేవారే. కానీ... ఇప్పుడు పరిస్థితులు వేరు! ‘‘టెన్షన్‌ పడింది చాలు. విహార యాత్రలను ముగించుకోండి. నియోజకవర్గాలకు వచ్చేయండి. కౌంటింగ్‌ ఏర్పాట్లు చూసుకోండి’’ అని పార్టీ నాయకత్వాలు అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి... నియోజకవర్గాలకు రప్పించి పనులు అప్పగిస్తున్నాయి. ‘టెన్షన్‌లో నుంచి అటెన్షన్‌లోకి వస్తున్నాం’ అని తాజా పరిస్థితిపై ఒక అభ్యర్థి వ్యాఖ్యానించారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ పూర్తయిన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్‌ మొదలైంది. దీనిని భరించలేక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది అభ్యర్థులు టూర్లకు వెళ్లిపోయారు. కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. ఇంకొందరు ఈ సమయాన్ని వైద్య పరీక్షలకు వాడుకొన్నారు. కుదిరిన వాళ్లు విదేశాలకూ వెళ్లారు. గత రెండు మూడు రోజులుగా అభ్యర్థులంతా తమ నియోజకవర్గాలకు తిరుగు ముఖం పడుతున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని పార్టీల నాయకత్వాలు తెస్తున్న ఒత్తిడి దీనికి ప్రధాన కారణం. టీడీపీ అభ్యర్థులందరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘హనీమూన్‌ టైం ముగిసింది. ఇక నియోజకవర్గాలకు వచ్చేయండి. చాలా పనులు ఉన్నాయి. అన్నీ చూసుకోకపోతే నష్టపోతారు’ అని ఆయన హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉండటం, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధా న పార్టీల నాయకత్వాలు ప్రతి చిన్న అంశంపైనా దృష్టి కేంద్రీకరించాయి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ పోస్టల్‌ బ్యాలెట్ల అంశాన్ని చాలా కీలకంగా పరిగణిస్తోంది. ఎన్నికల కమిషన్‌ లెక్కల ప్రకారం ఈసారి రాష్ట్రంలో 5.40 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. గతంలో ఇంత సంఖ్యలో ఏనాడూ ఇవి పోల్‌ కాలేదు. ఇందులో అత్యధిక భాగం ఈసారి తమకే వచ్చాయన్న అంచనాలో కూటమి పార్టీలు ఉన్నాయి. దీంతో ఈ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి అంశంపై టీడీపీ నాయకత్వం ఈసీకి పదేపదే లేఖలు పంపుతోంది. ఉదాహరణకు... కొన్ని పోస్టల్‌ బ్యాలెట్లపై ఆర్వోలు తమ ముద్ర వేయడం మర్చిపోయారు. కొన్ని చోట్ల గెజిటెడ్‌ అధికారులు ధ్రువీకరణ సంతకాలు చేసి స్టాంపు ముద్రించడం మర్చిపోయారు.


ఇది అధికారుల తప్పిదం కావడంతో... వాటికి మినహాయింపు ఇవ్వాలని టీడీపీ నాయకత్వం కోరుతోంది. అలాగే కొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు అధికారులు తక్కువ టేబుళ్లు ఏర్పాటుచేశారు. దీనివల్ల ఓట్ల లెక్కింపు బాగా ఆలస్యం అవుతుందని, ఎక్కువ టేబుళ్లు ఏర్పాటుపై ఆర్వోలను కోరాలని పార్టీనాయకత్వం సూచించింది. మామూలుగా ఓట్ల లెక్కింపు టేబుళ్ల చుట్టూ ఇనుప మెష్‌ అమరుస్తారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరిగే టేబుళ్లపై ఈ మెష్‌ పెట్టాలని ఈసీ ఆదేశం ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఎవరైనా నాలుగు బ్యాలెట్‌ పేపర్లు పట్టుకొని పారిపోతే లెక్కింపు ఆగిపోతుందన్న అనుమానంతో టీడీపీ నాయకత్వం దీనిపైనా ఈసీకి లేఖ పంపింది. ప్రతి బూత్‌లో పోలింగ్‌ పూర్తయిన తర్వాత పీవో సంతకంతో పార్టీల ఏజెంట్లు 17సీ ఫారం తీసుకోవాల్సి ఉంటుంది. బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో అందులో ఉంటుంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లకూ, ఫామ్‌-17సీలో నమోదుచేసిన లెక్క సరిపోవాలి. ఇప్పటికి 92శాతం బూత్‌ ఏజెంట్లు ఈ ఫారాలను తీసుకొని టీడీపీ కేంద్రకార్యాలయానికి పంపారు. మిగిలిన ఫారాలు కూడా వెంటనే సేకరించి పంపాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం ఆదేశించింది. తమిళనాడులో తమ పార్టీ నూటికి నూరు శాతం 17సీ ఫారాలు సేకరించి దేశంలో అగ్రస్థానంలో ఉందని డీఎంకే అధినేత స్టాలిన్‌ రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేశారు. ఆ రికార్డును అందుకోవాలని కూటమి పార్టీలు యత్నిస్తున్నాయి.

వైసీపీలో టెన్షన్‌..

ఓట్ల లెక్కింపునకు సంబంధించి వైసీపీ నాయకత్వం కూడా తన అభ్యర్థులను అప్రమత్తం చేస్తోంది. అయితే... అధికార పార్టీ అభ్యర్థుల్లో ‘అటెన్షన్‌’ కంటే టెన్షన్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ‘151 కంటే ఎక్కువే వస్తాయి’ అని విదేశాలకు వెళ్లేముందు జగన్‌ చేసిన ప్రకటనను వాళ్లు నమ్మడంలేదు. పాలకపక్ష సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా సొంతంగా ఎగ్జిట్‌ పోల్‌ చేయించుకున్నారు. ఇందుకోసం ప్రైవేటు సంస్థల సేవలు ఉపయోగించుకున్నారు. కానీ... జనం నాడి అందలేదని వాపోతున్నారు. దీంతో వారిలో రోజురోజుకూ టెన్షన్‌ పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు నియోజకవర్గాలకు వచ్చి మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.


ఎవరు... ఎక్కడికి...?

  • పోలింగ్‌ ముగిశాక ఈ నెల 17వ తేదీన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి లండన్‌కు వెళ్లిపోయారు.

  • గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. ‘తేడా వస్తే’ ఆయన అమెరికాలోనే స్థిరపడిపోతారనే ప్రచారమూ జోరుగా సాగుతోంది.

  • దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి లండన్‌కు వెళ్లారు.

  • అవంతి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో కలసి తిరుమల, శ్రీశైలం దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

  • విశాఖ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కూడా కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వెళ్లి వచ్చారు.

  • ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని తెలుస్తోంది.

  • మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డోన్‌లో అందుబాటులో లేరనిపార్టీ నేతలు చెబుతున్నారు. బుట్టా రేణుక, ఇంతియాజ్‌ తదితరులు కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో లేరని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం తన పుట్టినరోజును బెంగళూరులో స్నేహితులతో కలసి జరుపుకొన్నారు.

Updated Date - May 25 , 2024 | 07:00 AM