AP Elections: నగరిలో నువ్వా నేనా..?
ABN , Publish Date - May 27 , 2024 | 12:33 AM
నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్‌కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్‌లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక స్థానం నగరి. మంత్రి ఆర్కే రోజా వైసీపీ నుంచి బరిలోకి దిగారు. కూటమి అభ్యర్థిగా దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాశ్ బరిలో దిగారు. ఇక్కడ నుంచి గెలుపొందే అభ్యర్థిపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు కాయ్ రాజ్ కాయ్ అంటున్నారు.
పుత్తూరు అర్బన్, మే 26: నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్‌కు ఎనిమిది రోజులే గడువు ఉండడంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండలస్థాయి నాయకులు తిరిగి వస్తుండడంతో బెట్టింగ్‌లకు ఊపు వస్తోందనే మాటలు వినబడుతున్నాయి. ఈ దఫా నగరి సీటును టీడీపీ కైవసం చేసుకుంటుందనే అంచనాలతో బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. పోలింగ్ సరళి తర్వాత టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు పంటర్లు సిద్ధపడుతున్నారు. దీంతో పుత్తూరు, నగరి, వడమాలపేట, విజయపురం మండలాలకు చెందిన కొందరు నాయకులు ఎంతకైనా సరే అంటూ వైసీపీ నాయకులకు కబురు పంపుతున్నారు.
రూ.కోట్లలో బెట్టింగులు
నగరి కేంద్రంగా ఇప్పటికే రూ.కోటికిపైగా బెట్టింగు జరిగినట్లు తెలుస్తోంది. పుత్తూరులోనూ రూ.లక్షలు చేతులు మారాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం నగరి సీటుపై కాకుండా రాష్ట్రంలో తిరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ కాస్తున్నారు. దీంతోపాటు బూత్ పరిధిలో తమకే మెజార్టీ వస్తుందనే దానిపైనా వైసీపీ నేతలు బెట్టింగ్‌కు ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తంగా నగరి సీటులో గెలుపుపై బెట్టింగ్ పెట్టేందుకు మాత్రం వారు వెనకడుగు వేస్తున్నట్లు పంటర్లు అంటున్నారు. వీరితోపాటు పళ్లిపట్టు, తిరుత్తణి, తిరుపతి నుంచీ నగరి సీటుపై బెట్టింగ్‌రాయుళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పంటర్లు నగరి అసెంబ్లీ సీటులో ఎవరు గెలుస్తున్నారని ఆరా తీస్తున్నారు. పరిచయమున్న వ్యక్తులతోపాటు స్థానిక మీడియా ప్రతినిధులకూ ఫోన్ చేసి మరీ ఎవరు గెలుస్తారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
బుల్లెట్.. పందేలు
వి.కోట, మే 26: పలమనేరు నియోజకవర్గంలో గెలుపు ఓటములపై బుల్లెట్‌లను పందెం పెట్టారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థి అమరనాథరెడ్డికి ప్రతి మండలంలోను 3 వేల నుంచి 5 వేల మెజారిటీ తథ్యమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. నెర్నపల్లె పంచాయతీలో టీడీపీకి ఆధిక్యం వస్తుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా, మెజారిటీ రాదంటూ వైసీపీ సవాలు విసిరింది. దీంతో అక్కడ మెజారిటీపై ఇరు పక్షాలు రూ.లక్షల్లో బెట్టింగ్ పెట్టారు.
కొంగాటం పంచాయతీకి చెందిన టీడీపీ నేత ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటూ రూ.5 లక్షలు పందెం వేయగా, రాదంటూ నెర్నపల్లెకు చెందిన వైసీపీ నేత పందెం పెట్టారు. మరో చోట అమరనాథరెడ్డి గెలుస్తాడని తన బుల్లెట్‌ను పందెం వేయగా, గెలవరంటూ వైసీపీకి చెందిన నేత అతడి బుల్లెట్‌ను పందేనికి పెట్టారు. వి.కోట మండలంలో రూ.50 లక్షలకుపైగా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ గంగవరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ.లక్షల్లో పందెం కాశారు. ఇలా నియోజకవర్గంలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.
For Election News and Telugu News