Share News

AP Elections 2024: మైకులు బంద్.. ప్రలోభాలు స్టార్ట్

ABN , Publish Date - May 12 , 2024 | 04:14 AM

‘మా వీధిలో బోరు వేయించండి. గుడి నిర్మాణానికి సా యం చేయండి. మాకు రోడ్డు వేయించండి’ ఒకప్పుడు ఓట్లు అడగడానికెళ్లే అభ్యర్థులకు ఇలాంటి డిమాండ్లు ఎదురయ్యేవి. కానీ గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ట్రెండ్‌ మారింది.

AP Elections 2024: మైకులు బంద్.. ప్రలోభాలు స్టార్ట్
Election Campaign Closed

  • ముగిసిన ప్రచారం.. మొదలైన డబ్బుల పందేరం

  • నియోజకవర్గాల వారీగా ఓటుకు రేటు

  • కోస్తా, సీమల్లో సగటున ఓటుకు 2 వేలు

  • పలుచోట్ల మూడు నుంచి ఐదు వేలు

  • ఉత్తరాంధ్రలో 500 నుంచి వెయ్యి

  • నియోజకవర్గంలో 1.7 లక్షల ఓట్లకు నగదు

  • ఓటర్ల పంపిణీకే తొమ్మిది వేల కోట్లు

  • మొత్తంగా ఎన్నికల ఖర్చు 12 వేల కోట్లపైనే

  • తూర్పుగోదావరిలో రూ.7 కోట్లు సీజ్‌

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆ వెంటనే ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఎలక్షన్‌ కాక పెరిగిపోవడంతో అంతే స్థాయిలో నోట్ల ‘కట్టలు’ కూడా తెగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నగదు పంపిణీ విపరీతంగా పెరిగింది. రాజధాని ప్రభావం ఉండే నియోజకవర్గాల్లో ఓటుకు రూ.4 వేలు ఇస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఏకంగా రూ.8 వేల చొప్పున కొందరికి పంపిణీ చేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అందులో నాలుగో వంతు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్‌లపై గురి పెట్టిన అధికార పార్టీ.. ఆ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5 వేలు దాకా పంపిణీ చేసినట్టు సమాచారం.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘మా వీధిలో బోరు వేయించండి. గుడి నిర్మాణానికి సా యం చేయండి. మాకు రోడ్డు వేయించండి’ ఒకప్పుడు ఓట్లు అడగడానికెళ్లే అభ్యర్థులకు ఇలాంటి డిమాండ్లు ఎదురయ్యేవి. కానీ గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ట్రెండ్‌ మారింది. వ్యక్తిగతంగా ఓటుకు నోట్లు పంచే సంస్కృతి పెరిగింది. అది కూడా గతం లో కొన్ని వర్గాలకు మాత్రమే ఓటుకు నోటు విధానం ఉండేది. కానీ 2019 నుంచి ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. సామాజికవర్గం, మతం, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఓటరుకూ నోటు ఇవ్వాలనే లక్ష్యంతో అభ్యర్థులు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో సగటున లక్షన్నర ఓట్లకు నగదు పంపిణీ చేస్తే ఈ ఏడాది మరో 20వేల ఓట్లకు పంపిణీ పెరిగింది. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో సగటున 2.3లక్షల ఓట్లు ఉన్నాయి.


అందులో 70 నుంచి 75శాతం మందికి అంటే సుమారు 1.7 లక్షల ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేలా అభ్యర్థులు ప్లాన్‌ చేసుకున్నారు. ఇప్పటికే అందులో దాదాపు సగం మందికి పం పిణీ పూర్తయిపోయింది. మొత్తంగా ఈ ఎన్నికలు చాలా ఖరీదైనవిగా మారాయి. కేవలం ఓటర్లకే రూ.9వేల కోట్ల మేర పంపిణీ జరుగుతోంది. ఇక ఖర్చులు కూడా కలిపితే మొత్తం ఎన్నికల ఖర్చు రూ.12వేల కోట్లు దాటుతోంది. పదేళ్ల కిందట ఓటుకు ఇచ్చే డబ్బులు వందల్లోనే ఉండేవి. కానీ, ఎలాగైనా గెలవాలి అనే ఏకైక లక్ష్యంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు డబ్బులు కుమ్మరించారు. మిగిలిన పార్టీలకు వారితో పోటీపడక తప్పని పరిస్థితిని ఆ పార్టీ అభ్యర్థులు కల్పించారు. ఇప్పుడు గతంలో కంటే కొంత ఎక్కువగా పంపిణీ చేస్తున్నా రు. కోస్తా, రాయలసీమల్లో పంపిణీ భారీగా పెరిగినా ఉత్తరాంధ్ర మాత్రం ఓటుకు నోటులోనూ వెనకబడిపోయింది. గత ఎన్నికల్లో రూ.500 ఇచ్చిన అభ్యర్థులు ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నారు. విశాఖ జిల్లాలోనూ ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నారు. శ్రీకాకుళంలో సగటున రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా రేటు నిర్ణయిస్తున్నారు. ఒక్కరే ఓటరు ఉంటే రూ.1500 వరకు ఇస్తున్నారు.


తీసుకోకపోయినా ఇబ్బందే..

నగదు పంపిణీ అందరికీ విస్తరించగా, ఎక్కడైనా కొందరు నగదు తీసుకోకూడదు అనుకున్నా కూడా వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎవరైనా ఓటుకు నోటు వద్దంటే వారిని అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి. నగదు పంపిణీలో పలు రకాలున్నాయి. ఉదాహరణకు చాలా చోట్ల తమ పార్టీకే ఓట్లు వేస్తారనుకుంటే డబ్బులు ఇస్తారు. కొన్నిచోట్ల రెండు వైపులా నగదు పంపిణీ చేస్తారు. రెండు పార్టీల్లో ఒక పార్టీ నుంచి తీసుకోకపోయినా, ఒక్క పార్టీయే నగదు ఇస్తుంటే అక్కడ వద్దన్నా వారి ఓట్లు మనకు పడవు అని పార్టీలు భా వించే పరిస్థితి ఉంటుంది. దీంతో ఇచ్చినంత తీసుకుని ‘మీకే ఓటేస్తాం’ అని చెప్పే అలవాటు ఓటర్లలో పెరిగింది.


టెక్నాలజీనీ వాడేస్తున్నారు..

2019లో కోస్తాంధ్రలో సగటున ఒక్కో అభ్యర్థి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి అది రూ.60కోట్లు దాటుతోంది. 1.7లక్షల మందికి ఓటుకు రూ.2వేలు చొప్పున ఇస్తే రూ.35 కోట్లు అవుతుంది. ఎలాగైనా చంద్రబాబు, లోకేశ్‌లను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ.. కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5వేలు పంపిణీ చేస్తోంది. ఇక, ఓట్ల కొనుగోలుకు అభ్యర్థులు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఎవరికి నగదు అందిందో అభ్యర్థి రియల్‌టైమ్‌లో చూసుకునే టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇక పలుచోట్ల నగదు పంపిణీకి అవుట్‌సోర్సింగ్‌ విధానంలో టీమ్‌లను పెట్టుకున్నారు. టీమ్‌లు పంపిణీ చేసిన తర్వాత స్థానిక నాయకులు వాటిని క్రాస్‌ చెక్‌ చేస్తున్నారు.


మైకులు బంద్.. ప్రలోభాలు స్టార్ట్..

పల్నాడు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంతైనా వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నారు. అయితే ఎంత ఖర్చుపెట్టినా గెలవడం కష్టం అని గత వారం పది రోజుల నుంచి ప్రచారం మొదలైంది. దీంతో డీలా పడిపోయినా ఆ ఎమ్మెల్యే పెట్టినవరకు చాలని, ఇక పంపిణీలు ఆపేద్దాం అని ఓ నిర్ణయానికొచ్చారు. అయితే అభ్యర్థి సతీమణి మాత్రం పట్టు వదల్లేదు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక అటో ఇటో తేల్చుకోవాల్సిందేనని, రూ.వంద కోట్లు పోయినా ఫరవాలేదని పంపిణీని కొనసాగిస్తున్నారు. డిమాండ్‌ ఆధారంగా ఓటుకు రూ.5వేలు కూడా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే రెండో రోజే టీడీపీలో చేరిపోతారని ప్రచారం జరుగుతోంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 12 , 2024 | 07:46 AM