AP News: అలాంటి నేతలకు పదవులు ఇచ్చే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:45 PM
ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామంటూ నేతలు పదవులు కావాలని అడగడం ఏమాత్రం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడందే ఏదీ రాదనే విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు.
అమరావతి: టీడీపీ పార్టీలో కష్టపడి పని చేసిన వారికే పదవులు దక్కుతాయని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగానే గుర్తింపు, పదవులు ఉంటాయని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పార్టీలో ఊరికే ఉన్నామంటే కుదరదని, అలాంటి నేతలు ఎటువంటి పదవులు ఆశించకూడదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన వివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామంటూ నేతలు పదవులు కావాలని అడగడం ఏమాత్రం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడందే ఏదీ రాదనే విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. కొందరు ఎమ్మెల్యే అయిపోయామనో, పదవులు వచ్చేశాయనో పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఏది వచ్చినా అది కేవలం పార్టీ వల్ల మాత్రమే వచ్చాయనే విషయాన్ని నేతలు దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
టీడీపీ పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ పనులు ఆపకుండానే టీడీపీ పార్టీకి ఈసారి సమయం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాగే పదవుల్లో ఉన్న నేతలు లేని నాయకులు సైతం నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం కష్టపడాలని ఆయన సూచించారు. అలాంటి నాయకులనే గుర్తించి పైకి తీసుకొస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకానీ ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ ఏమాత్రం కష్టపడని వారికి పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నిర్మోహమాటంగా చెప్పేశారు.
వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం..
ఈ సందర్భంగా వైసీపీ పార్టీ, నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని చంద్రబాబు అన్నారు. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం అని ఆయన చెప్పారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతోపాటు ప్రతీ చోటా దీనిపై చర్చ జరగాలని అన్నారు. విజన్-2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని చెప్పారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కళ్లకు కనిపిస్తున్నాయని అన్నారు. భవిష్యత్తుతరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమం ఒకరోజు పెట్టి వదిలేసేది కాదని, భవిష్యత్తు కోసమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijaypal: ముగిసిన విజయ్‌పాల్ విచారణ.. ఏం తేలింది
MLC: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీ మూర్తి ప్రమాణ స్వీకారం