AP High Court: నటి జత్వానీ కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Nov 30 , 2024 | 09:14 PM
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషచం తెలిసిందే. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది.
అమరావతి: ముంబై నటి కాదంబరీ జత్వానికి(kadambari jatwani) వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నికు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో సీఐడీ ఇవాళ(శనివారం) అఫిడవిట్ దాఖలు చేసింది. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. పోలీస్ అధికారులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని అఫిడవిట్‌లో సీఐడీ అధికారులు తెలిపారు.
జత్వానీను అక్రమంగా అరెస్ట్ చేశారని అఫిడవిట్‌లో సీఐడీ అధికారులు వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని సీఐడీ అధికారులు చెప్పారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారన్నారు. వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందని తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించిన అధికారులకు బెయిల్ మంజూరు చేస్తే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లి పోయే అవకాశం ఉందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
వారిపై సస్పెన్షన్ వేటు..
ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591,1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని వెబ్‌సైట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
అక్రమంగా నిర్బదించారు..
కాగా.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బదించారని ఆమె పేర్కొన్నారు. తన పూర్వాపరాలు, ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గన్ని ద్వారా ఆరా తీయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని కాదంబరి కోరిన విషయం తెలిసిందే.
నిబంధలనకు పూర్తి విరుద్ధంగా..
పక్కా స్కెచ్‌తోనే ముంబై నటి కాదంబరి జెత్వానీని ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకొచ్చి వేధించారు. నాటి ముఖ్యమంత్రి జగన్ తన సొంత మనుషులను కాపాడుకోవడం కోసం ఓ మహిళను బలి చేశారనే ఆరోఫణలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారులు, పోలీసులు 24 గంటల్లో కథ నడిపారు. నిబంధలనకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు దారుణం వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పదేళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాలి. ఆ నిబంధనలన్నీ తుంగలోకి తొక్కారు. ఈ కథ మొత్తం తాడేపల్లి డైరెక్షన్‌లో సాగింది. పోలీసులు ఆగమేఘాలపై వారెంట్ తీసుకుని ముంబై వెళ్లారు. ఎస్‌ఐ స్థాయి అధికారి వెళ్లాల్సిన ఈ కేసులో ఎస్పీ స్థాయి అధికారి వెళ్లారు. కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా వేధించారు. కాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేకంగా నియమించిన అధికారి వివరాలు సేకరిస్తున్నారు.