AP NEWS: విషమంగా చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి
ABN , Publish Date - Nov 16 , 2024 | 10:03 AM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో వారం క్రితం AIG ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని సమాచారం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో వారం క్రితం AIG ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని సమాచారం. అయితే1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు.
రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సమాచారం అందడంతో ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి లోకేష్ హైదరాబాద్ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి.
మహారాష్ట్ర పర్యటన రద్దు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు చేసుకున్నారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చంద్రబాబు పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కంక్లేవ్‌లో పాల్గొని వెంటనే హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్ననికి హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రికి నేరుగా చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో నిన్న(శుక్రవారం) భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీకి ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు ఇవ్వబోతున్న రుణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా వచ్చేలా చూడాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తుంది.
నిధులపై చర్చ...
అలాగే బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులతోపాటు ఏపీ బడ్జెట్‌లోని లోటును సైతం పూడ్చాలని మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్జప్తి చేశారని సమాచారం. నదుల అనుసంధంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కులంకుషంగా చంద్రబాబు చర్చించారు. అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో సైతం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే గతంలో రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యమైంది. ఆ దేశంతో భాగస్వామ్యాన్ని పునరుద్దరించాలని సీఎం కోరారు. దీనికి సైతం ఆయన ఓకే అన్నట్లు సమాచారం.
గతనెలలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం..
టాలెంటెండ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) నిశ్చితార్థం గత నెలలో జరిగిన విషయం తెలిసిందే. ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) హీరోయిన్ సిరిలెల్లా (Siri Lella)ను వివాహమాడబోతున్నారు. వారి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ (Novatel Hotel)లో జరిగింది.. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
తొలి సినిమా ‘బాణం’తోనే ఆకట్టుకున్న నారా రోహిత్...
నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ.. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన నారా రోహిత్.. ఆ పేరును మాత్రం ఎప్పుడూ వాడుకోలేదు. తన కష్టాన్ని నమ్ముకునే స్వశక్తితో హీరోగా ఎదిగారు. ప్రస్తుతం నారా రోహిత్ వయసు నాలుగు పదులు దాటడంతో.. నారా ఫ్యామిలీ ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. ‘ప్రతినిధి 2’ సినిమాలో తన సరసన నటించిన ‘సిరి’ విషయం చెప్పి.. పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. ‘సిరి’ని ఆయన కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నారనే టాక్ కూడా వినబడుతోంది. ఏదయితేనేం.. ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. ఆ అమ్మాయినే రోహిత్ పెళ్లాడుతుండటంతో ఇండస్ట్రీలోని మరో జంట.. కపుల్ కాబోతున్నారంటూ అంతా.. ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక నిశ్చితార్థం అనంతరం వారి పెళ్లి ఎప్పుడనేది అఫీషియల్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది.