Share News

CM Chandrababu: పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై చంద్రబాబు కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 14 , 2024 | 06:48 PM

జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రాధాన్యత అని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా తమ విధానం మార్చుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

CM Chandrababu:  పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై  చంద్రబాబు కీలక నిర్ణయం

అమరావతి: పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి ఏపీని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లలో 227 ఎంఓయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు, ఎవరూ మనుగడ సాధించలేని పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.


పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని విమర్శలు చేశారు. 1995 కంటే ముందు లైసెన్స్ రాజ్ కారణంగా పెట్టుబడులు రాలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆర్ధిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగామని ఉద్ఘాటించారు. ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమేనని సీఎం చంద్రబాబు తెలిపారు.


యువతకు 20 లక్షల ఉద్యోగాలు..

‘‘2047కి భారత్ నెంబర్‌‌వన్ దేశంగా తయారైతే ఏపీ కూడా దేశంలోనే నెంబర్ వన్‌గా ఉండాలనేలా ఈ పాలసీలు తీసుకొచ్చాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రాధాన్యత. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా విధానం మార్చుకున్నాం. ఉత్పత్తి వ్యయం తగ్గించటం, బ్రాండ్ ఇలా అన్ని అంశాల్లోనూ దృష్టి పెట్టాం. ప్రతీ కుటుంబంలోనూ ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతాం. పెట్టుబడి ప్రాజెక్టులు అనుకున్న సమయానికే మొదలయ్యేలా ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. రియల్ టైమ్‌లోనే అనుమతుల జారీ, సెల్ఫ్ సర్టిఫికేషన్ అంశాన్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నాం. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఏపీ గ్లోబల్ డెస్టినేషన్‌గా..

‘‘ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ అన్ని రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి రూపొందించాం. ఏ విధానమైనా 2024-29 వరకూ అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మొత్తంగా 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలన్నది మా లక్ష్యం. 20 లక్షల మంది ఉపాధి పొందేలా ఈ విధానాలు రూపొందించాం. రూ. 83 వేల కోట్ల మేర విదేశీ పెట్టుబడులు రావాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం. అలాగే 175 నియోజకవర్గాల్లో ప్రతీ చోటా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక చేశాం. గతంలో ప్రతీ రెవెన్యూ డివిజన్ లోనూ ఓ ఇంజనీరింగ్ కళాశాలను పెట్టి ఇంజనీర్లను తయారు చేశాం. ఏ విధానమైనా యువతకు ఉపాధి కల్పించటమే ప్రధాన ఉద్దేశం.ఎంతవేగంగా అనుమతులు ఇస్తామన్నదే ప్రాతిపదికన ఈ పాలసీలు రూపొందాయి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 06:52 PM