TDP: మంగళగిరిలో ఓటమి తర్వాత.. అక్కడే పోటీ చేయమన్నారు.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 27 , 2024 | 07:41 PM
మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓటమిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓటమిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... సీనియర్లను గౌరవిస్తా.. పని చేసే వారిని ప్రొత్సహిస్తానని అన్నారు. మంగళగిరిలో గెలుపు కోసం కాదు.. మెజార్టీ కోసం పని చేయాలని సూచించారు. మంగళగిరిని టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకున్నానని తెలిపారు. మంగళగిరిలో తాను ఓడిపోయి అవమానాలు ఎదుర్కొన్నాను.. నా ఓటమి వల్ల చంద్రబాబు కూడా విమర్శలు ఎదుర్కొన్నారని అన్నారు. ఉత్తరాంధ్ర వెళ్లి పోటీ చేయండి.. ఇంపాక్ట్ ఉంటుందని ఎంతో మంది చెప్పారని.. కానీ మంగళగిరిని వదలకూడదని ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నానని తెలిపారు. మంగళగిరిలో ఓటమి తర్వాత తనలో కసి, బాధ్యత పెరిగిందని చెప్పారు. వచ్చే 72 రోజులు చాలా ముఖ్యమని.. పట్టు విడవకుండా పని చేయాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
టీడీపీలో చేరిన దుగ్గిరాల వైసీపీ నేతలు
నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు శనివారం నాడు టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, యడ్ల వెంకటరావు, జయలక్ష్మి, పలు గ్రామాల సర్పంచ్‌లు టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి లోకేష్ వారని పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్నేళ్లుగా దుగ్గిరాల మండలంలో క్రీయాశీలకంగా వీరు పనిచేస్తున్నారు. ఈ నేతలు టీడీపీలోకి వస్తే మంగళగిరిలో కొంత బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి.