Guntur: తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ నేత రిమాండ్‌కు తరలింపు..
ABN , Publish Date - Nov 06 , 2024 | 07:29 PM
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట రామిరెడ్డికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడంటూ అరస్టయిన కేసులో అతడికి రిమాండ్ విధించింది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట రామిరెడ్డికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ అగ్రనేతలపై సోషల్ మీడియాలో అభ్యంతరక పోస్టులు పెట్టాడంటూ నవంబర్ 4న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం, మంత్రులపై దుష్ర్పచారాలు చేస్తున్నాడంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు వెంకటరామిరెడ్డిని ఇవాళ (బుధవారం) నగరంపాలెం పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరిచారు. దీంతో వైసీపీ నేతకు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది.
కాగా, ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా దుష్ర్పచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ అంశంపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చలు జరిపింది. వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తు్న్నారంటూ క్యాబినెట్ సమావేశంలో పవన్ చర్చను లేవనెత్తారు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంనైన తనపైనా విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. మంత్రులు, ఇంట్లో ఉన్న ఆడవారిపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొంత మంది పోలీసులు సైతం వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.
దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీసు అధికారులు సైతం పట్టించుకోవడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా తానే ఫోన్ చేసినా కొంత మంది ఎస్పీలు స్పందించడం లేదని మండిపడ్డారు. తమ కింది స్థాయి అధికారులపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేద్దామని పవన్‌కు చెప్పారు. వైసీపీ వాసనలు ఇంకా వారిలో పోలేదని అంతా సెట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై చర్చించి వారిని గాడిలో పెడదామని డిప్యూటీ సీఎంకు చెప్పారు. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేయగా, జిల్లాకు చెందిన ఓ సీఐని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితపై అసభ్యకర పదజాలంతో కడపకు చెందిన వర్రా రవీంద్రరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పవన్ కల్యాణ్ సీరియస్ కావడంతో కేసు నమోదు చేసిన కడప పోలీసులు మంగళవారం సాయంత్రం అతన్ని అరెస్టు చేశారు. అనంతరం 41ఏ నోటీసు ఇచ్చి వదిలిపెట్టారు. అయితే మరో కేసులో అతడిని అరెస్టు చేసేందుకు కడప పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన రాజంపేట పోలీసులకు రవీంద్రరెడ్డిని అప్పగించకుండా వారు నేరుగా వదిలేశారు. ఈ విషయం కాస్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Cabinet: ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..
US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు