Share News

CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:19 PM

ఆంధ్రప్రదేశ్‎లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై ఏపీ సచివాలయంలో ఈరోజు( ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై ఏపీ సచివాలయంలో ఈరోజు( ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు. ఈ మేరకు రేపు(సోమవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిమిత్తం లంక గ్రామాలకు అవసరమైతే హెలీకాప్టర్లు పంపుతామని అన్నారు.

బాధితులకు ఆపన్న హస్తం

కాగా, బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆపన్నహస్తం అందించనున్నారు. ఇందులో భాగంగానే 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు బాధితులకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు.


రెగ్యులర్ మానిటరింగ్‎తో...

కొన్ని చోట్ల ఎప్పుడూ పడనంత వర్షం పడిందని చెప్పారు. 14 నియోజకవర్గాల్లో 20 సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అన్నారు. వత్సవాయి, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో 30 శాతం వర్షపాతం నమోదైందని తెలిపారు. జాతీయ రహాదారులు స్థంభించిపోయాయని రోడ్ల మీదకు నీరు భారీగా వచ్చిందని అన్నారు. ఈ వర్షాలపై నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం రెగ్యులర్ మానిటరింగ్ చేయడం వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉందని.. కానీ 9 మరణాలు సంభవించాయని.. దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు.


ప్రకాశం బ్యారేజీకి వరద..

1-2 లక్షల క్యూసెక్కుల నీరు వాగుల ద్వారా వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోందని తెలిపారు. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే సూచనలున్నాయని అన్నారు. దిగువ ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నామని.. బండ్స్ పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

బుడమేరుకు పెద్ధ ఎత్తున వరద వస్తోందన్నారు. 1.50 లక్షల హెక్టార్లల్లో వరి పంట, ఉద్యాన పంటలూ నష్టపోయాయని చెప్పారు. 17 వేల మందిని క్యాంపులకు తరలించామని వివరించారు. 8 బోట్లు.. రెండు ఛాపర్లు అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను త్వరగా రెస్క్యూ చేయగలిగామని అన్నారు. కళింగపట్నంలో తుఫాన్ తీరం దాటితే.. కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం పడుతుందదని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


గుంటూరు-ఎన్టీఆర్ జిల్లాల్లో 37 శాతం వర్షపాతం నమోదు

28 శాతం మేర సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలు.. కాల్వకట్టలు ఎక్కడన్నా బలహీనంగా ఉంటే పటిష్ట పరుస్తామని అన్నారు. బుడమేరు వాగును కొల్లేరులో కలిపే పనులను వైసీపీ ప్రభుత్వం సరిగా చేయలేదని విమర్శలు చేశారు. ఫలితంగా వీటీపీఎస్ మునిగిపోయిందని చెప్పారు. దీంతో విజయవాడ మునిగిందని.. గత పాలకులు నిర్వాకం స్పష్టంగా కన్పిస్తోందని మండిపడ్డారు. 50 ఏళ్లుగా పడని వర్షాలు ఇప్పుడు పడ్డాయని చెప్పారు. 37 శాతం వర్షపాతం గుంటూరు-ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదైందని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారు సహయక చర్యలకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.


అమరావతిపై దుష్ప్రచారం..

పంట నష్టం అంచనాలో కూడా సాంకేతికతను వినియోగించుకుంటామని చెప్పారు. ముంపునకు గురైన పంటలను త్వరగా లెక్కిస్తామని తెలిపారు. అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుద్ది ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయరని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కొండవీటి వాగు లిఫ్ట్ ద్వారా రాజధాని ముంపును నివారిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Updated Date - Sep 01 , 2024 | 05:17 PM