AP News: వైసీపీ ఓటమికి అదే కారణమట..!
ABN , Publish Date - Jun 23 , 2024 | 01:30 PM
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైసీపీ(YSRCP) ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఈ నైరాశ్యంలో తమ ఓటమికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు.
అమరావతి, జూన్ 23: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైసీపీ(YSRCP) ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఈ నైరాశ్యంలో తమ ఓటమికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి కొత్త రీజన్ చెప్పారు. నాసిరకం మద్యమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పారు. మద్యం తాగే వాళ్లు వైసీపీకి ఓటు వేయలేదన్నారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల, విజయసాయిరెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదన్నారు.
ఇదేకాదు.. మరికొన్ని కారణాలు కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించాయని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వైసీపీలో కొందరు నాయకుల నోటి దురుసు కూడా ఓటమికి కారణమైందన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబుని బూతులు తిట్టారని.. ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ శ్రేణులలో కసిని పెంచాయన్నారు.
ఎవరిని అవమానాలకు గురి చేసినా వారిలో కసి పెరిగి విజయం సాదిస్తారని చరిత్ర చెబుతోందని.. 2019లో జగన్ గెలిచినా, ఇప్పుడు చంద్రబాబు గెలిచినా అవమానాల నుంచి వచ్చిన కసే కారణం అని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ వాళ్లు గెలిచాక చాలా చోట్లు దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కార్యాలయాన్ని సైతం కూల్చివేశారన్నారు. కూల్చివేత చట్ట పరంగా జరిగినా.. ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదని.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని చెప్పారు మహేష్ రెడ్డి.