Share News

Guntur: యువతిని ఎత్తుకెళ్లిపోయిన రౌడీ షీటర్.. చివరికి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:55 AM

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే యువతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న (శనివారం) సాయంత్రం యువతిని కారులో తీసుకెళ్లాడు.

Guntur: యువతిని ఎత్తుకెళ్లిపోయిన రౌడీ షీటర్.. చివరికి..

గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ షీటర్ చేసిన పనికి ఓ కుటుంబం విలవిల్లాడిపోతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు చేసిన తీవ్ర ప్రయత్నాలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. నవీన్ అనే రౌడీ షీటర్ శనివారం నాడు ఓ యువతిని కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అనంతరం బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు. ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.


గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే యువతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న (శనివారం) సాయంత్రం యువతిని కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. సహాన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే తమ కుమార్తెకు ఏం జరిగిందో తెలియని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విని షాక్ అయ్యారు. ఇలా జరిగిందేంటని కన్నీటిపర్యంతం అయ్యారు. నవీన్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.


అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన సహానకు బ్రెయిన్ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే విషయాన్ని బాధిత కుటుంబానికి తెలియజేశారు. తామేమీ చేయలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో కుమార్తెను బతికించుకునేందుకు గుంటూరు, మంగళగిరిలోని పలు ఆస్పత్రుల చుట్టూ యువతి తల్లిదండ్రులు తిరిగారు. వైద్యులందరూ తామేమీ చేయలేమని చెప్పడంతో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చివరికి గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా యువతి మృతిచెందింది. ఈ ఘటన సంచలనంగా మారింది.


యువతి మృతిపై సహాన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్ నవీన్ యువతిని ఎక్కడికి తీసుకువెళ్లాడు, ఏం చేశాడు, ఎందుకు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయ్యిందనే పలు కోణాల్లో విచారణ చేపట్టారు. బృందాలుగా ఏర్పడి నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వల్లభాపురం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై రౌడీ షీట్ ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

Andhra Pradesh:నడిరోడ్డుపై వదిలేశారు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం..

Updated Date - Oct 20 , 2024 | 02:03 PM