Share News

Minister Narayana: డయేరియాపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:21 PM

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల్లోగా డ్రెయిన్లలో పూడిక తొలగించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశాలు జారీ చేశారు.

Minister Narayana: డయేరియాపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
Minister Narayana

పల్నాడు జిల్లా: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల్లోగా డ్రెయిన్లలో పూడిక తొలగించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు( శనివారం) సచివాలయంలో మంత్రి నారాయణ అధికారులతో సమావేశం అయ్యారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు.

డయేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కేసులు పెరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షపు నీరు పైప్ లైన్లలోకి చేరడం వల్ల నీరు కలుషితం అవుతుందని అన్నారు. లెనిన్ నగర్, మారుతి నగర్‌లోని 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్లు బయటపడిందని చెప్పారు. ఇవాళ కూడా ఈ రెండు ప్రాంతాల్లో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయని అన్నారు.


అందరూ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, డయేరియాపై ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు చర్చించారని తెలిపారు. ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. పిడుగురాళ్ల వ్యాప్తంగా ఉన్న 170 కిలోమీటర్ల డ్రైన్లలో పూడిక తొలిగించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. పట్టణంలోని అన్ని హ్యాండ్ బోర్లలో నీటిని పరిరక్షించాలని అన్నారు. వీలైనంత త్వరగా 100 శాతం డయేరియా నివారించేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రజలంతా కాచి చల్లార్చిన నీరు తాగాలని మంత్రి నారాయణ సూచించారు.

Updated Date - Jul 13 , 2024 | 09:26 PM