Nimmala Ramanaidu: జగన్ అంతటి ఘనుడు .. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:55 PM
జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో డిస్కంలపై రూ. 18 వేల కోట్లు బకాయిల భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
పశ్చిమగోదావరిజిల్లా: ఆర్థిక నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) సీఎం సహాయ నిధిలో భాగంగా రూ .13 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జగన్ ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దుచేశారని ధ్వజమెత్తారు. పేద, మధ్యతరగతి రోగులకు వైద్యాన్ని దూరం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న విద్యుత్తు లోటును 2014 -19 ఐదేళ్లలో మిగులు విద్యుత్‌గా మార్చిన ఘనత చంద్రబాబుది అని ప్రశంసించారు . గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్తును అందించామని తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ప్రజలపై సర్ చార్జీల భారం మోపారని మండిపడ్డారు.జగన్ పాలనలో డిస్కంలపై రూ. 18 వేల కోట్లు బకాయిల భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం: మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్ బోర్డు పెట్టడం ఖాయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి భిన్నంగా పేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను సీఎం చంద్రబాబు తుడుస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులు చేస్తే కూటమి ప్రభుత్వం పేదలకు ఒక రోజు ముందే పింఛన్ల ఇస్తుందని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు.కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశం దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
జగన్‌కి సిగ్గు ఉండాలి : మంత్రి ఫరూక్
నంద్యాల జిల్లా: కర్నూలులో హైకోర్టు , మూడు రాజధానులను ఏర్పాటు చేస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారని.. ఒక్కటి కూడా అమలు చేయలేదని మంత్రి ఎన్. ఎండీ ఫరూక్ అన్నారు. అన్ని పాపాలూ చేసి శాలువాలు కప్పాలి.. సన్మానించాలి అంటున్నాడు...కొంచెం అన్నా జగన్‌కి సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారని.. అమలు చేసి చూపించారని మంత్రి ఫరూక్ తెలిపారు.
ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కర్నూలు : కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... అహంకారంతో విర్ర వీగిన వైసీపీని ప్రజలు పాతాళానికి తొక్కేశారని చెప్పారు. ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ పాలన చూసి పక్క రాష్ట్రాలు కూడా అస్యహించుకుని మాట్లాడాయన్నారు. పక్క రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ కార్తీక వనభోజనం కార్యక్రమం కాల్వబుగ్గ రామేశ్వరాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ ఎం.డీ ఫరూక్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి,ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.