Minister Parthasarathy: జోగి రమేష్ వివాదం.. మంత్రి పార్థసారథి క్షమాపణలు
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:09 PM
ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.
అమరావతి: టీడీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం రచ్చరేపింది. పార్టీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథి క్లారిటీ ఇచ్చారు. నారా లోకేష్‌ని ఇవాళ పార్థసారథి కలిసి క్లారిటీ ఇచ్చారు. నూజివీడు ఘటన వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన గౌరవాన్ని తాను ఎప్పుడు మర్చిపోనని మంత్రి పార్థసారథి అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్‌లో మరోసారి తాను పార్టీ హై కమాండ్, కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. గౌడ సామాజికవర్గం వాళ్లు ప్రోగ్రామ్ డిజైన్ చేశారని గుర్తుచేశారు. జోగి రమేష్‌ను సడన్‌గా చూసి తాను షాక్‌కు గురిఅయ్యానని తెలిపారు.
జోగి రమేష్‌కు చిల్లర చేష్టలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. తాను టీడీపీ సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని అన్నారు. వైసీపీ తానులో నుంచి చించుకొని బయటకు వచ్చానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు తనను ఆదరించారని అన్నారు. నూజివీడులో తనను టీడీపీ కార్యకర్తలు భుజం మీద వేసుకుని గెలిపించారని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. తనను ఎవరెవరు కలుస్తున్నారనేది కూడా తనకు తెలియజేయాలని ఇంటెలిజెన్స్ అధికారులను కోరానని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
పార్థసారథి క్షమాపణలు
నూజివీడు కార్యక్రమంపై వివాదం చెలరేగడంతో మంత్రి పార్థసారథి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. ‘గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీలకతీతంగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గౌడ సామాజిక వర్గీయులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జోగి రమేశ్ రావడం యాదృచ్ఛికంగా జరిగింది. కూటమి నేతలెవరూ ఆయన్ను ఆహ్వానించ లేదు. బలహీన వర్గాలకు చెందిన నన్ను మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుది. ఆయన, లోకేశ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నాను. మన్నించాలని ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు..
కాగా.. ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కీలక నేతల మధ్య వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ఆదేశించారు. అయితే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారని.. ఆయన్ను వివరణ అడగకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నూజివీడు గౌడసంఘం నేతలు ఆదివారం ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లచ్చన్న మనుమరాలు గౌతు శిరీషతోపాటు నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులతో పాటు జోగి రమేశ్, గన్నవరం ఎంపీపీ, వైసీపీ నేత అనగాని రవి కూడా వచ్చారు.
పార్టీ వర్గాలు విస్మయం ..
టీడీపీ నేతలతో కలిసి జోగి వాహనంపై నిలబడి ఊరేగింపులో పాల్గొనడమే గాక వేదికపై కూడా వారి సరసన కూర్చున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో ఆయనే ప్రధాన నిందితుడు. ఇక అనగాని రవి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన కేసులో కీలక పాత్రధారి. ఇలాంటి వ్యక్తులను తమతోపాటు వేదికపై కూర్చోబెట్టుకోవడం ద్వారా టీడీపీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ వర్గాలతో పాటు నిఘా వర్గాల నుంచీ సమాచారం సేకరించిన లోకేశ్.. కేంద్ర కార్యాలయ బాధ్యులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. టీడీపీ నేతలు జోగిని తమ మధ్య కూర్చోబెట్టుకుని కార్యక్రమం నడిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్థసారథి, శిరీష నుంచి వివరణ కోరాలని వారిని ఆదేశించారు. అయితే కొనకళ్లను మాత్రం వివరణ అడగలేదు. దీనిపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు కొనకళ్ల సూచనతోనే నిర్వాహకులు జోగి రమేశ్‌ను పిలిచారని తాము విన్నామని, ఆయన్ను వివరణ కోరకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
AP Skill Development : ఏపీలో 532 స్కిల్ హబ్‌లు
Read Latest AP News and Telugu News