Share News

Satyakumar: ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:22 PM

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar) తెలిపారు. నాట్కో ఫార్మా కంపనీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

Satyakumar: ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై కీలక ప్రకటన
Minister Satyakumar

గుంటూరు జిల్లా: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar) తెలిపారు. నాట్కో ఫార్మా కంపనీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రూ. 100 కోట్లతో మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు జీజీహెచ్ అభివృద్ధికి సహకారం అందించారని వివరించారు. శనివారం నాడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. జీజీహెచ్‌లో సిటీ స్కాన్ సెంటర్‌ను మంత్రులు ప్రారంభించారు.


ఆస్పత్రిలో పలు వార్డులను మంత్రులు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశం అయ్యారు. అధికారులకు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... ఏపీ వ్యాప్తంగా ఉన్న 111 ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీజీహెచ్ ముందు వరుసలో ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో నాణ్యత, నకిలీ మద్యం గంజాయితో రాష్ట్రం అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతుందని తెలిపారు. ఆరోగ్య శ్రీ , ఆయుష్మాన్ భారత్ త్వరలోనే నూతన విధానాలతో అమలు చేయనున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు.


ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష: పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani-Chandra-Sekhar.jpg

పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన సిటీ స్కాన్ సెంటర్ రూ. 4 కోట్లతో ప్రారంభించామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తెలిపారు. శనివారం నాడు జీజీహెచ్‌లో సిటీ స్కాన్ సెంటర్‌ను మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ.. కేన్సర్ నివారణకు నాట్కో ఫార్మా కంపెనీ రూ.45 కోట్లతో జీజీహెచ్‌లో కేన్సర్ కేంద్రాన్ని అభివృద్ధి చేసిందని వివరించారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగిందని వెల్లడించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా చక్కటి సహకారాన్ని అందించారని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 09:23 PM