Share News

Pawan Kalyan-PM Modi: ‘మోదీజీ మీరు నిజంగా దేశానికి స్ఫూర్తిదాయకం’ .. జనసేనాని ప్రశంసల వర్షం..

ABN , Publish Date - Nov 27 , 2024 | 05:01 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Pawan Kalyan-PM Modi:  ‘మోదీజీ మీరు నిజంగా దేశానికి స్ఫూర్తిదాయకం’ .. జనసేనాని ప్రశంసల వర్షం..

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మోడీ నా‌పై‌ చూపే అభిమానం, ఆప్యాయత ఎంతో విలులైనది. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించారు. గాంధీనగర్‌లో నా మొదటి సమావేశం నుంచి ఈ సమావేశం వరకు, మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’’ అని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఢిల్లీ పర్యటనలో పవన్ బిజీ బిజీ..

PAWAN--3.jpg

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (బుధవారం) న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్పటికే పవన్ ఓసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన విషయం విదితమే. ఇక ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సైతం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాస్‌లు ఉన్నారు. ఇక పార్లమెంట్ భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. పవన్‌ను కలిశారు.

PAWAN-2.jpg


పవన్ కల్యాణ్ మూడో రోజు ఢిల్లీ పర్యటనలో ఈరోజు బిజీ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్... తన పర్యటనలో భాగంగా మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాల గురించి చర్చించారు. అలాగే ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌తో సైతం పవన్ భేటీ అయ్యారు.


భూపేంద్ర యాదవ్‌‌తో పవన్ కల్యాణ్ భేటీ..

PAWAN-1.jpg

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్‌గా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ని కోరారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలను పవన్ కల్యాణ్ తీసుకువచ్చారు.


సింగిల్ విండో విధానం ఉండాలి..

‘‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


ఏ రాష్ట్రంలో పట్టుబడినా...

‘‘ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలి. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుంది’’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Updated Date - Nov 27 , 2024 | 06:41 PM