Share News

Pawan Kalyan: పర్యావరణ నిబంధనల అమలుపై కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:22 PM

జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు.

Pawan Kalyan: పర్యావరణ నిబంధనల అమలుపై కీలక ఆదేశాలు
Pawan Kalyan

అమరావతి: జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వికసిత భారత్ - 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దామని సూచించారు. సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు అని తెలిపారు. పంట కాల్వల్లోకి వ్యర్థాలు విడిచిపెడుతున్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.


కాగా.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పవన్‌కు పీసీబీ అధికారులు వివరించారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించామని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అనుమతుల ప్రకారం రోజుకి 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పతి చేస్తున్నారని చెప్పారు. అందుకు తగ్గ విధంగా ఎఫ్లుయెంట్ టాంక్స్ లేకపోవడం, వ్యర్థ జలాలను బైపాస్ చేసి వదిలేస్తున్నారన్నారు. రొయ్యల వ్యర్థాలను సైతం పర్యావరణ నిబంధనలు పాటించకుండా పారవేస్తున్నారని తెలిపారు.ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. 15 రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వకుంటే.. అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ వ్యర్థ జలాలను పంట కాల్వల్లోకి వదిలేస్తున్న విషయంపై గతంలోనే పవన్ కళ్యాణ్ కు గురజనాపల్లి ప్రాంత రైతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 05 , 2024 | 10:23 PM