Pawan Kalyan: పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకుంటాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 22 , 2024 | 11:09 AM
అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు.
అమరావతి: అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రాదని చెప్పారు. ఇద్దరు యజమానులు హైదరాబాద్‌లో ఉంటారని అధికారులు చెబుతున్నారని అన్నారు. వారిద్దరి మధ్య గొడవ, బాధ్యతలేని నాయకత్వం ఫ్యాక్టరీ విషయంలో ఉందని అర్ధమైందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చే సమయంలో మొదటి అంతస్తులో ప్రమాదం జరిగిందని అన్నారు. తాను వచ్చిన రోజు నుంచి చెబుతున్నా.. సేఫ్టీ ఆడిట్ చేయాలని ఆదేశించానని తెలిపారు. పరిశ్రమల యజమానులు దీనిపై అవగాహన లేక భయపడ్డారని చెప్పారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయనేది వాస్తవమని అన్నారు. అధికారులు కూడా పరిశ్రమల నిర్వాహకులను పిలిపించి మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. జనాలు, కార్మికుల ప్రాణాలు పోకూడదని తాను భావిస్తున్నానని అన్నారు. సేప్టీ ఆడిట్ చేస్తే.. పరిశ్రమలు వెళ్లిపోతాయనే ప్రచారం జరుగుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై నిందలు పడతాయని ఆలోచిస్తున్నానని అన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికుల ప్రాణ రక్షణ కూడా చాలా అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
సెప్టెంబర్ నుంచి పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. విశాఖపట్నానికి తానే స్వయంగా వెళ్లి పరిశీలించి, సమావేశాలు పెడతానని ఉద్ఘాటించారు. పొల్యూషన్ ఆడిట్ జరగాలి.. ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రమాదాలను నివారించాలనేది అందరి బాధ్యత కదా అని గుర్తుచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటూనే.. ప్రమాదాలు జరగకుండా ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
విశాఖపట్నంలో పొల్యూషన్ పెరిగిపోవడంతో.. పరిశ్రమల అనుమతి కొంతకాలం ఆపారని గుర్తుచేశారు. ఆ తర్వాత మళ్లీ అనుమతులు ఇవ్వడంతో.. పొల్యూషన్ బాగా పెరిగిందని చెప్పారు. పొలిటికల్ సపోర్టు వల్ల పరిశ్రమల నిర్వాహకులు కూడా నిబంధనలు పాటించడం లేదని అన్నారు. పరిశ్రమలు కావాలి.. పర్యావరణ సమతుల్యత సాధించాలనే దానిపై అందరూ ఆలోచన చేయాలని సూచించారు. ఇందులో అందరూ బాధ్యత తీసుకోవాలని.. ముందుకు రావాలని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడిచారు.