Share News

Minister Payyavula: తిరుమలకు జగన్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు

ABN , Publish Date - Sep 22 , 2024 | 09:26 PM

లడ్డూ వివాదంపై విచారణ జరుగుతుందని.. చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

Minister Payyavula: తిరుమలకు జగన్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు
Payyavula Keshav

అనంతపురం: టీటీడీలో ఐదేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల లడ్డూ నాణ్యత, అన్నదానం నాణ్యతపై చాలా కథనాలు వచ్చాయని తెలిపారు. చెప్పేందుకు సిగ్గు పడాల్సిన విధంగా లడ్డూ కల్తీ చేశారని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు.


ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ... తిరుమలకు జగన్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా వెళ్లాలి కానీ జగన్ ఎప్పుడు సతీసమేతంగా తిరుమల కొండకు వెళ్లకుండా ఒక్కడే వెళ్లారని చెప్పారు. స్వామిని దర్శనం చేసుకుంటే రిజిస్టర్‌లో సంతకం చేయాలని చెప్పారు. జగన్ ఎప్పుడూ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తిరుమలలో బయటపడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.


లడ్డూ వివాదంపై విచారణ జరుగుతోందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో ఎలాంటి వ్యక్తులను నియమించారో విచారణ చేపడుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేయడం లేదని.. వాస్తవాలు వెలికి తీస్తామని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

Updated Date - Sep 22 , 2024 | 09:32 PM