Pemmasani: BSNL 4జీ సేవలపై కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 04 , 2024 | 07:47 PM
భారత దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ప్రకటించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
గుంటూరు జిల్లా: భారత దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ప్రకటించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఆదివారం నాడు తాడికొండలో నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్‌ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఏపీ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ద్వారా నాణ్యమైన 4జీ సేవలు వినియోగదారులకు అందిస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.
4500 టవర్స్ ఏర్పాటు చేయడం ద్వారా త్వరలోనే నాణ్యమైన బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. అతి తక్కువ రేట్లతో ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థలు ఎక్కువ రేట్లు పెంచడం మూలంగా అందరూ బీఎస్ఎన్ఎల్ సేవల కోసం ముందుకు వస్తున్నారని అన్నారు. రాజధానిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకున్న లక్ష్యాలు పేదలకు అందించే వరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.