Share News

AP Politics: టీడీపీ - జనసేన పొత్తులపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:19 PM

ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

AP Politics: టీడీపీ - జనసేన పొత్తులపై  పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోగా.. బీజేపీతోనూ కలిసి నడవడానికి తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో నడుస్తున్న అరాచక పాలనను సాగనంపడానికి ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని బాబు పిలుపునిచ్చేశారు. ఢిల్లీకెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించి తిరిగొచ్చిన చంద్రబాబు.. అటు జనసేన, ఇటు బీజేపీ సీట్ల పంపకాలపై దృష్టిపెట్టారు. సీట్ల కేటాయింపులు దాదాపు అయిపోగా.. ఇక అధికార ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్నది ఇన్ సైడ్ టాక్.

TDP-Janasena-BJP.jpg

మేం రెడీనే కానీ..?

ఈ పరిస్థితుల్లో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి ఎప్పుడో చెప్పామని అన్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లపై, ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుందన్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత అభ్యర్థులపై కసరత్తు చేస్తామని అన్నారు.

Purandeshwari.jpg

తప్పకుండా ఆశీర్వదిస్తారు!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా దొంగ ఓట్లను నమోదు చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశామని వివరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లను వైసీపీ నేతలు నమోదు చేశారని మండిపడ్డారు. కలెక్టర్, అధికారులపై ఈసీ చర్యలు తీసుకుందని.. దీని వెనుక ఎవరున్నారనేది విచారణలో తేలుతుందన్నారు. బీజేపీ ప్రజల పక్షాన ఉందని.. కాబట్టి ప్రజలు తమను రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఆశీర్వదిస్తారని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించామని చెప్పారు. చర్చల కోసం ఢిల్లీలో ఉండమని హై కమాండ్ ఆదేశిస్తే తప్పకుండా ఉంటానని పురందేశ్వరి పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 10:41 PM