Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 15 , 2024 | 07:28 AM
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి.
విశాఖపట్నం: కార్తీక పౌర్ణమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉసిరిచెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభ దేవీకి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి, ఉసిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులకు వేదపండితులు తీర్థప్రసాదాలు అందించారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను భక్తులు వెలిగించారు. శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.
విశాఖపట్నంలో కార్తీక పౌర్ణమి సందడి..
ఉమ్మడి విశాఖపట్నంలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తుల ప్రత్యేక పూజలు
పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పంచారామ క్షేత్రానికి వేకువజాము నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. దీపోత్సవంతో దేవాలయ ప్రాంగణం కళకళలాడింది.
నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్థానాలు
పశ్చిమ గోదావరి: నరసాపురం వశిష్ట గోదావరిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి వలందర్ రేవు కిటకిటలాడింది. గోదావరిలో కార్తీక దీపాలు విడిచి పెట్టి భక్తులు పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో భక్తులు బారులు దీరారు.
రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి శోభ..
రాజమండ్రి: రాజమండ్రిలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. గోదావరి స్నానఘట్టాల్లో భక్తుల పుణ్య స్నానాలు చేశారు. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
వేయిస్తంబాల దేవాలయంలో ప్రత్యేక పూజలు..
వరంగల్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం గోదావరి దగ్గర కార్తీక పౌర్ణిమ శోభ సంతరించుకుంది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి దీపాలను భక్తులు గంగలో వదిలారు. మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతరకు భక్తులు తరలిస్తున్నారు. దీంతో కందికొండ భక్తులతో రద్దీగా మారింది. దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భద్రాచలం గోదావరి తీరంలో పుణ్య స్నానాలు
భద్రాద్రి కొత్తగూడెం: :కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు కార్తీక మాస పుణ్య స్నానాలు చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు.