AP Politics: ‘జగన్ నా అన్నే కాదు’.. షర్మిల ఆన్ ఫైర్.. మునుపెన్నడూ ఇలా తిట్టి ఉండరు..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:31 PM
CM YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నెక్ట్స్ లెవల్‌లో ఫైర్ అయ్యారు. జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కన్నెర్ర చేశారు.
కడప, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నెక్ట్స్ లెవల్‌లో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇక సాక్షి అంశాన్ని ప్రస్తావించిన వైఎస్ షర్మిల.. ఆ సంస్థలో తనకూ వాటా ఉందన్నారు. సోమవారం నాడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు తనపై చేస్తున్న కామెంట్స్, విమర్శలు, ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. జోకర్ గాళ్లను తనపై ఉసిగొలిపారని, ఎవరు ఏం చేసినా అదిరేది.. బెదిరేది లేదన్నారు షర్మిల. సభా వేదికగా వైఎస్ షర్మిల చేసిన సంచలన కామెంట్స్ యధావిధంగా..
సీఎం జగన్ నా అన్నే కాదు..
‘జగన్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. రక్త సంబంధమే ఉంది. అయితే, జగన్ సీఎం అయ్యాక మారిపోయాడు. ఇప్పుడున్న ఈ జగన్.. నా అన్న కానే కాదు. వైసీపీలో జగన్ రెడ్డి సైన్యం నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వైసీపీలో రోజుకొక జోకర్ గాడు నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మహిళను అని కూడా చూడకుండా నాపై దిగజారి మాట్లాడుతున్నారు.’ అంటూ వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు షర్మిల.
సాక్షిలో భాగముంది..
‘నాపై వ్యతిరేకంగా రాస్తున్న సాక్షి మీడియాలో నాకూ భాగం ఉంది. నేనూ రాజశేఖర్ రెడ్డి బిడ్డనే. సాక్షిలో నాకు తప్పకుండా భాగం ఉంది. బుద్ధిలేకుండా సోషల్ మీడియాలో కొందరు జోకర్ గాళ్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. జగన్ రెడ్డి సైన్యంలో రోజుకొక జోకర్ గాన్ని నాపైకి పంపుతున్నారు. నేను పులివెందుల పులిబిడ్డను. ఎవ్వడికి భయపడను. ఏమి పీక్కుంటారో పీక్కోండి.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు షర్మిల.
అదంతా పచ్చి అబద్ధం..
‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారు. కానీ, ఆయన మార్క్ పరిపాలన ఇప్పుడున్న జగన్ పాలనలో లేదు. కడప జిల్లా వాసి అయిన జగన్.. ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయాడు. కడప -బెంగుళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేశాడు. వైసీపీని అధికారంలోకి తేవడానికి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. వైసీపీ కోసం గొప్ప త్యాగం చేస్తే.. నా పైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారు. జగన్‌ను జైల్లో పెట్టించి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విషప్రచారం చేస్తున్నారు. అదంతా శుద్ధ అబద్ధం. సోనియా గాంధీ వద్దకు అనిల్.. జగన్ భార్య భారతి రెడ్డితో కలిసే వెళ్లారు. వైసీపీ వారికి దమ్ముంటే ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండి.’ అంటూ తీవ్రంగా స్పందించారు షర్మిల.