Minister Ravindra: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెుల్ల కాంస్య విగ్రహం ఏర్పాటు..
ABN , Publish Date - Sep 14 , 2024 | 05:50 PM
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు ఆది కవయిత్రి మెుల్ల కాంస్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ పాల్గొన్నారు.
విజయవాడ: తెలుగు సాహిత్య చరిత్రలోనే రచయిత్రి మొల్లమాంబకు ప్రత్యేక స్థానం ఉందని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెుల్ల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.." తెలుగు జాతికి మెుల్ల ఓ విలువైన రత్నం. ఆది కవి నన్నయ్య అయితే ఆది కవయిత్రి మొల్ల. మెుదటి తెలుగు కవియిత్రిగా తెలుగువారి గుండెల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆరు కాండాలు, 871పద్యాలతో రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనం. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఆమె అనువాదం ఉంటుంది. మెుల్లను ఆదర్శంగా తీసుకుని విద్యార్థినిలు ముందుకెళ్లాలి. ఆమె స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి దేశానికి కీర్తి తీసుకురావాలి. తెలుగు భాష గొప్పతనాన్ని భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ సంకల్పించాలి. మాతృభాషలో చదువుకున్నప్పుడే అన్నీ అంశాలపై అవగాహన పెరుగుతుంది. చేతి, కుల వృత్తులను కాపాడుకోవాలి" అని అన్నారు.
కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు శతాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మైసూర్ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ అన్నారు. తెలుగు, కన్నడ భాషలు ఎంతో గొప్పవని ఆయన చెప్పారు. తెలుగు కవయిత్రి మొల్ల ధీరవనిత అని కృష్ణదత్త కొనియాడారు. ఆనాటి కాలంలో ఎలాంటి రాజస్థానాల అండా లేకుండా ఆమె రామాయణాన్ని అచ్చ తెలుగులో రాసి శ్రీరాముడికి అంకితమిచ్చారని ప్రశంసించారు. శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి నుంచి కర్ణాటక, ఆంధ్ర మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఒకప్పుడు మైసూర్ ఆస్థానంలో ఎందరో తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగు సంతతివారేనని, దేశవ్యాప్తంగా ఆయన ఎంతో కీర్తిప్రతిష్ఠలు గడించారని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Minister Ramanaidu: జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..
Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన