Vangalapudi Anitha: వరద బాధితులకు అండగా హోంమంత్రి అనిత..
ABN , Publish Date - Sep 02 , 2024 | 07:29 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సమయంలో విజయవాడ సమీపం బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి మెుత్తం పర్యటిస్తూ వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి మరీ ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరిశీలించారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు గ్రామాలు, రోడ్లు.. వాగులు, నదులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీట మునిగిన ఇళ్లే కనిపిస్తున్నాయి. ప్రజలు నానావస్థలు పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బాధితులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వరద బాధితులను అండగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రణాళికలు రచించి వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు రాత్రంతా వరదముంపు ప్రాంతాల్లో పర్యటించగా.. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం బాధితులకు అండగా నిలిచారు.
అనిత పర్యటన..
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సమయంలో విజయవాడలోని బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి మెుత్తం పర్యటిస్తూ వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి మరీ ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరిశీలించారు. ఐఏఎస్ అధికారులు సిద్ధార్థ్ జైన్, వీరపాండ్యన్ వంటి అధికారులతో చర్చలు జరిపి ఆహారాన్ని బాధితుల వద్దకు చేర్చేందుకు కృషి చేశారు. ఆహార పొట్లాల్లో భోజనం, తాగునీరు సహా అన్ని ఉండేలా సమకూరుస్తున్నారా లేదా అని హోంమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. సహచర మంత్రి కొల్లు రవీంద్రతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహించారు. ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూడాలంటూ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ బాధితుల వద్దకు ఆటోలలో ఆహారాన్ని తరలించారు.
రికార్డుస్థాయి..
మరోవైపు ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరింది. 11,25,876లక్షల క్యూసెక్కులకు వరదనీరు చేరడంతో బ్యారేజీ అన్ని గేట్లను 23.6అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ చరిత్రలో రికార్డుస్థాయి వరద అని అధికారులు చెప్తున్నారు. 2009అక్టోబర్‌లో 10.94లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 1903వ సంవత్సరంలో 10.60లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వచ్చిన వరదనీరే రికార్డుస్థాయి అంటూ అధికారులు వెల్లడించారు. భారీ ఎత్తున వచ్చిన వరదలకు బ్యారేజీ దిగువన ఉన్న అనేక గ్రామాలు నీట మునిగాయి. దీంతో బ్యారేజీపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వరదలతో రైల్వేశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణానది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి నడుపుతున్నారు. మరోవైపు బ్యారేజీ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నందిగామ మండలం అంబర్ పేట, ఐతవరం, కీసర వద్ద హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి.