Share News

Vijayawada: ఘోరం.. రోడ్డుప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య..

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:45 PM

నాగరాజు, ఉష దంపతులకు 18నెలల క్రితం పెళ్లి అయ్యింది. వారిద్దరూ నగరంలోని భాను నగర్ బీఆర్టీఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఉద్యోగ రీత్యా నాగరాజు ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి ఇవాళ (మంగళవారం) ఉదయం బయలుదేరాడు.

Vijayawada: ఘోరం.. రోడ్డుప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య..

విజయవాడ: భార్యభర్తలు ఇద్దరూ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ జీవితాంతం ఒకరినొకరు వదిలిపెట్టమని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేందుకు పెళ్లితో శ్రీకారం చుడతారు. అయితే ప్రమాదవశాత్తూ ఇద్దరిలో ఒకరు చనిపోయే ఆ బాధను వర్ణించేందుకు మాటలు రావు. కేవలం వారి భాగస్వామికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు. అలాంటి సమయంలో కొంతమంది భాగస్వామి జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. అరుదుగా మరికొంతమంది తమ భాగస్వామి లేరన్న విషయాన్ని జీర్ణించుకులేక వారితోపాటే వీరూ తనువు చాలించేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. భర్త మృతిచెందారన్న వార్త తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హృదయాల్ని కలచివేస్తోంది. నాగరాజు, ఉష దంపతులకు 18నెలల క్రితం పెళ్లి అయ్యింది. వారిద్దరూ నగరంలోని భాను నగర్ బీఆర్టీఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఉద్యోగ రీత్యా నాగరాజు ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి ఇవాళ(మంగళవారం) ఉదయం బయలుదేరాడు. ఇంటి నుంచి కొంత దూరం వెళ్లే సరికే వేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం నాగరాజు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్‌పై ఉన్న వ్యక్తికి సైతం తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం గురించిన సమాచారాన్ని ఉషకు తెలియజేశారు.


కన్నీటి పర్యంతం అవుతూనే ఉష హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా భర్త మృతదేహాన్ని చూసి గుండెలు పలిలేలా ఏడ్చింది. నాగరాజు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. దీంతో ఉష అక్కడ్నుంచి ఇంటికి వచ్చింది. నాగరాజు లేని జీవితం తనకు వద్దనుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఇద్దరివైపు బంధువులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకే రోజు భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగింది.

Updated Date - Oct 08 , 2024 | 04:45 PM