Share News

AP Politics: జగన్‌కు షాక్.. వైసీపీ కంచుకోట ఖాళీ..!

ABN , Publish Date - Aug 18 , 2024 | 11:10 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవగానే పరిస్థితులు మారిపోయాయి. మున్సిపాలిటీ సమయం ఇంకా రెండేళ్లు ఉండటం, పైగా రాష్ట్రంలో టీడీపీ గెలిచి, వైసీపీ పూర్తిగా కుదేలైపోవటంతో ఇక్కడి కౌన్సిలర్లు పూర్తిగా ఆలోచనలో పడిపోయారు. దీనికి తోడు వైసీపీ ముఖ్య నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నియోజకవర్గంలో..

AP Politics: జగన్‌కు షాక్.. వైసీపీ కంచుకోట ఖాళీ..!

నందికొట్కూరు, ఆగస్టు 18: మొన్నటి వరకు నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దాదాపు పదేళ్లు ఆ పార్టీ హవా నడిచింది. కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడంతో పరిస్థితి మారిపోయింది. వైసీపీలోని నాయకులంతా మూకుమ్మడిగా టీడీపీలో చేరుతున్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులంతా టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో వైసీపీ ఖాళీ కాగా, ప్రస్తుతం మండల స్థాయి నాయకులు కూడా వైసీపీని వీడుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు పార్టీ కేడర్‌ను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పదేళ్లుగా తాము చెప్పినట్లు నడిచిన వారంతా ఇప్పుడు పార్టీని వదిలేసి వెళుతోంటే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. మొత్తానికి నందికొట్కూరులో 20 ఏళ్ల కిందటి టీడీపీ వైభవం మళ్లీ కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరపడుతున్నారు.


గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నందికొట్కూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. ఇక టీడీపీ ఒక స్థానానికి మాత్రమే పరిమితమైంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవగానే పరిస్థితులు మారిపోయాయి. మున్సిపాలిటీ సమయం ఇంకా రెండేళ్లు ఉండటం, పైగా రాష్ట్రంలో టీడీపీ గెలిచి, వైసీపీ పూర్తిగా కుదేలైపోవటంతో ఇక్కడి కౌన్సిలర్లు పూర్తిగా ఆలోచనలో పడిపోయారు. దీనికి తోడు వైసీపీ ముఖ్య నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక వైసీపీలోనే కొనసాగితే లాభం లేదని ఆ పార్టీ కౌన్సిలర్లు గ్రహించారు. పట్టణ అభివృద్ధి కోసమంటూ వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌ రెడ్డితో సహా మరి కొంతమంది కొద్ది రోజుల కిందట బైరెడ్డి రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ తర్వాత వెంటనే మరో 11 మంది వైసీపీ కౌన్సిలర్లు మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపాలిటీ టీడీపీలో బలం పెరిగిపోగా, వైసీపీ ఒకరిద్దరికి పడిపోయింది. రానున్న కాలంలో వీరు కూడా టీడీపీలో చేరతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే జరిగితే నందికొట్కూరు మున్సిపాలిటీ పూర్తిగా టీడీపీ పరమైనట్లే!


ఎంపీటీసీల వంతు..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలాల్లో కూడా ఆ పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. నందికొట్కూరు మండలంలో 12 ఎంపీటీసీలకు గాను 4 ఎంపీటీసీ స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. నియోజవర్గంలోని మిగిలిని 5 మండలాల్లో ఎంపీటీసీలు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం మండల నాయకులు కూడా వైసీపీని వీడితేనే మంచిదన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నెమ్మదిగా ఒక్కొక్కరు సైకిల్ను ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరుకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో నందికొట్కూరు మండలంలో టీడీపీ ఎంపీటీసీ బలం 4 నుంచి 6కి పెరిగింది. అలాగే పాములపాడు ఎంపీపీ కూడా ఇప్పటికే టీడీపీలో చేరారు. ఇక ఇప్పటికే వైస్ ఎంపీపీ వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆమెతో పాటు మరొకరు కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


విలవిలలాడుతున్న వైసీపీ..

నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపు 20 ఏళ్లుగా టీడీపీ ఎదురుగాలి వీచింది. వైసీపీ ఆవిర్భవించకముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ఇక్కడ గట్టి పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరుపై వైసీపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అయితే స్థానికేతరుడికి టికెట్ కేటాయించడాన్ని ఆ పార్టీలోని వారు అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీకి లోపాయికారిగా మద్దతు తెలపడం ప్రారంభించారు. దీనికి తోడు స్థానికుడైన గిత్త జయసూర్య ప్రజల అభిమానం చూరగొని ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా నందికొట్కూరు నియోజకవర్గానికే చెందిన డా. బైరెడ్డి శబరి కూడా నంద్యాల ఎంపీగా గెలిచారు. దీంతో ఇక్కడి వైసీపీ కేడర్ ఘనంగా తమ పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు ఇటు జిల్లాలో, అటు రాష్ట్రంలో వైసీపీ పూర్తిగా గాలికి కొట్టుకుపోవటంతో స్థానికంగా గట్టిగా నిలబడి నాయకులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్నిచ్చే నాయకుడు లేకుండా పోయాడు. పూర్తిగా దిశానిర్దేశం లేకుండా పోయిన వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.


పనులు చేయించుకునేందుకు..

గత ప్రభుత్వం హయాంలో దాదాపు పట్టణాల్లో, మండల, గ్రామస్థాయిల్లో పనులు సక్రమంగా జరగలేదు. ఇక జరిగిన పనులకు సంబంధించి బిల్లులు కూడా చాలా వరకు మంజూరు కాలేదు. ప్రస్తుతం వైసీపీ నామమాత్రంగా మిగిలిపోవటంతో ఆ పార్టీలో ఉంటే తమకు ఒరిగేదేమీ లేదని నాయకులు, కార్యకర్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. పైగా టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలోని బిల్లులు మంజూరు కావాలన్నా, కొత్త పనులకు ఆమోదం జరగాలన్నా ఆయా స్థానిక సంస్థల్లో మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలి. ఎలా చూసినా తాము పార్టీ మారితేనే మంచిదన్న ఉద్దేశంతో పార్టీ మారుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులు నెమ్మదిగా జరుగుతున్నా, రానున్న కాలంలో ఈ ఫిరాయింపులు మరిన్ని ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Also Read:

టీడీపీకి లైన్ క్లియర్.. ఇక మిగిలింది అదే..!

అందరూ’ ఎవరు జోగి!?

గాలితో ‘నడిచే శిల్పాలు’

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 18 , 2024 | 11:10 AM