Share News

PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:18 AM

ఏమి చేసైనా జగన్‌ కళ్లలో ఆనందం చూడాలి... ఎలాగైనా పోలీస్‌ బాస్‌ పోస్టు సాధించాలి! ఇలాంటి లక్ష్యంతో ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ నిఘా విభాగం మాజీ చీఫ్‌ చేశారు.

 PCR Anjaneyulu : సీఎం సార్‌కు సారీ చెప్పాలి!

  • బాబు ఇంటి చుట్టూ నిఘా మాజీ చీఫ్‌ ప్రదక్షిణ

  • ఆంజనేయులుకు సీఎం అపాయింట్మెంట్‌ లేదన్న అధికారులు

  • హైదరాబాద్‌లో గేటు వద్దే పీఎ్‌సఆర్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ

  • పోలీస్‌ బాస్‌ అవ్వాలని గత ప్రభుత్వంలో అడ్డగోలు పనులు

  • వీఆర్‌ఎ్‌సకు అనుమతిస్తే వెళ్లిపోయేందుకు ఇప్పుడు పాట్లు

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఏమి చేసైనా జగన్‌ కళ్లలో ఆనందం చూడాలి... ఎలాగైనా పోలీస్‌ బాస్‌ పోస్టు సాధించాలి! ఇలాంటి లక్ష్యంతో ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ నిఘా విభాగం మాజీ చీఫ్‌ చేశారు. ఇప్పుడు ఆయన పడుతున్న పాట్లు పోలీసుశాఖలో చర్చనీయాంశమయ్యాయి. మాజీ సీఎం జగన్‌ తాడేపల్లి ప్యాలె్‌సలో ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చుని నిన్నటిదాకా రాజకీయ సమస్యలు పరిష్కరించిన పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, ప్రభుత్వం మారడంతో హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నారు.

రాష్ట్ర పోలీసు శాఖనే తన గుప్పిట్లో పెట్టుకుని డీజీపీగా అధికారం చెలాయించాలని చూసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి..... రెండేళ్లు సర్వీసు ఉండగానే వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి సిద్ధమైనట్లు ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల్లో ఎస్పీగా ఎన్‌కౌంటర్లతో ఒక వెలుగు వెలిగారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా మహిళా వైద్యురాలితో జరిపిన ఫోను సంభాషణతో అభాసుపాలై రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.

2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వీసుల్లోకి తిరిగొచ్చి జగన్‌కు కళ్లు, నోరు, చెవులు అన్నీ ఆయనే అయ్యారు. రాష్ట్రంలో నిఘా విభాగం అధిపతి పోస్టు ఆశించి వచ్చిన ఆయనకు.....మొదట్లో బ్రేక్‌ పడింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా సర్దుకోవాల్సి వచ్చింది. పొరుగు రాష్ట్రం నుంచి స్టీఫెన్‌ రవీంద్రను తెచ్చుకునే ప్రయత్నం చేయడం, ఐజీ ర్యాంకులో ఉన్న మనీశ్‌కుమార్‌ సిన్హాకు నిఘా చీఫ్‌ బాధ్యతలు ఇవ్వడం ఆంజనేయులుకు నచ్చలేదు. దీంతో బుర్రకు పదును పెట్టి జగన్‌కు బాగా నచ్చే పనులపై దృష్టి సారించారు.


అందలం కోసం అడ్డగోలు పనులు

ప్రతిపక్ష నేతల్ని లక్ష్యంగా చేసుకుని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడి ద్విచక్ర వాహన షోరూమ్‌పై పడ్డారు. చిన్నచిన్న తప్పులు పట్టుకుని చుక్కలు చూ పించారు. ఆ షోరూమ్‌లో అసెంబ్లీకి సంబంధించిన కుర్చీలు ఉన్నాయంటూ కోడెల పరువు తీశారు. పోలీసులు దొంగతనం కేసు పెట్టడంతో మనస్తాపానికి గురైన ఆయన ఏకంగా లోకాన్నే వదిలి వెళ్లిపోయారు.

మొదటిసారి జగన్‌ కళ్లల్లో ఆనందం చూసిన ఘటన అది. ఇక రెండో గురి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌.... విభజిత రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనంతపురం జిల్లాలో అత్యంత హేయమైన దూషణకు దిగారు. అప్పట్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేపీ ప్రభాకర్‌ రెడ్డి ‘దమ్ముం టే తాడిపత్రికా రా.. ’ అంటూ సవాల్‌ విసిరారు.

అప్పటినుంచి జేసీపై జగన్‌ గుర్రుగా ఉన్నారనే విషయాన్ని ఆంజనేయులు పసిగట్టారు. జేసీ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రాన్స్‌పోర్టు వ్యాపారంపై పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనానికి మార్పులు చేసి ఏపీలో ఆర్టీఏ అనుమతి తీసుకోలేదంటూ బస్సుల్ని ఆపించారు. హైదరాబాద్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జేసీ ప్రభాకర్‌ రెడ్దిని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసి లాక్కొచ్చి కడప సెంట్రల్‌ జైలుకు పంపించారు. ఈ రెండు ఘటనలతో జగన్‌ మనసును పీఎ్‌సఆర్‌ గెలుచుకున్నారు. ఏసీబీ డీజీగా రెండో పోస్టు సాధించారు. దీంతో మరింత రెచ్చిపోయిన పీఎ్‌సఆర్‌.. అప్పటి ప్రతిపక్ష నేతలపై వరుసగా గురిపెట్టారు.

అసెంబ్లీలో జగన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న అచ్చెన్నాయుడుపై ఈఎ్‌సఐ మందుల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీలో కేసు పెట్టారు. ఆపరేషన్‌ చేయించుకున్న అచ్చెన్నను టెక్కలిలోని ఇంటిలో అరెస్టు చేసి గుంటూరుకు కారులో తీసుకొచ్చి సుమారు 70 రోజులు జైలుపాలు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ వ్యాపారాన్ని దెబ్బకొట్టడంతో పాటు సొంత లాభం కోసం అమూల్‌ సంస్థకు జగన్‌ రాష్ట్రంలోకి రెడ్‌ కార్పెట్‌ వేశారు. దీనికి సంగం డెయిరీ చైర్మన్‌గా సహకరించని ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేయించి జైలుకు పంపిన ఘనత కూడా పీఎస్‌ఆర్‌దే. రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఉన్నత స్థానాన్ని అధిరోహించకుండా ఆయన కుమార్తె అమరావతిలో భూమి కొనుగోలు చేశారంటూ కేసు పెట్టారు.


ఇలాంటివి చేస్తోన్న పీఎ్‌సఆర్‌ను జగన్‌ బహిరంగంగానే ’అంజన్నా’ అని పిలిచే స్థాయి లో అభిమా నాన్ని చూరగొన్నారు. వెంటనే, నిఘా విభాగం అధిపతి పోస్టు సాధించారు. అప్పటినుంచి తాడేపల్లి ప్యాలె్‌సలోనే మకాం పెట్టారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించడం.. పరిష్కరించేందుకు నడుం బిగించి అటువైపు వ్యక్తుల్ని బెదిరించడం..జగన్‌ మనసుకు నచ్చే లా ప్రవర్తించడం.. సర్వసాధారణం అయ్యాయి. ఏ తప్పూ చేయని చంద్రబాబుపై పలు కేసులు పెట్టించి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అరెస్టు చేయించడం వెనుక కీలక కుట్రదారు, సూత్రధారి ‘ఆంజన్న’ అనే విషయం రాష్ట్రంలో ఎక్కువ మందికి తెలుసు. ఎలాగైనా డీజీపీ పోస్టు సాధించేందుకు ఆయన చేసిన అడ్డగోలు పనులలో పలువురు పోలీసుల్ని కూడా భాగస్వాముల్ని చేశారు.

చేసినవి చిన్న పాపాలు కావు..

వైసీపీ నాయకుని తరహాలో అడ్డమైన పనులు చేస్తోన్న పీఎ్‌సఆర్‌ను ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌ తప్పించింది. అయినా పలు జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేస్తూ మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది.. జాగ్రత్తగా ఉండండి అంటూ బెదిరించినట్లు వార్తలొచ్చాయి. అయితే జగన్‌ అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు దారుణంగా ఓడించడంతో అవాక్కైన ఆంజనేయులు.....తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఉండవల్లి కరకట్టవైపు వచ్చి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. అపాయింట్మెంట్‌ లేదని సెక్యూరిటీ అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మరో ప్రయత్నం చేశారు. రెండు రోజులుగా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండటంతో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అపాయింట్మెంట్‌ లేదని అధికారులు చెబుతుంటే ’సీఎం సార్‌కు సారీ చెప్పేందుకే వచ్చా’ అంటూ బతిమాలు తున్నట్లు సమాచారం. లోపలి నుంచి సిగ్నల్‌ లేకుండాతాము అనుమతించబోమంటూ సెక్యూరిటీ సిబ్బంది తెగేసి చెప్పడంతో ఊసూరుమంటూ ఆదివారం మరోమారు వెనుదిరిగారు.

ఈ విషయం పోలీసుశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ తప్పూ చేయని ఏబీ వెంకటేశ్వరరావును ఐదేళ్ల పాటు వేధించిన జగన్‌ ప్రభుత్వంలో పాపాలు పంచుకున్న పీఎ్‌సఆర్‌ జీవితకాలం క్షమాపణకు అర్హుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. వీఆర్‌ఎస్‌ కోసం అనుమతి కోరేందుకే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి లాంటి వారికి రిటైర్మెంట్‌ ముందు రోజు పోస్టింగ్‌ ఇచ్చి పంపించిన చంద్రబాబు.......తాను క్షమాపణ చెబితే వీఆర్‌ఎ్‌సకు అనుమతి ఇవ్వరా.? అనే ఆలోచనలో పీఎ్‌సఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 08 , 2024 | 05:18 AM