Share News

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:47 AM

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు.....

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

  • మళ్లీ రాజధానికి విచ్చేయనున్న 45 సంస్థలు

  • సీఆర్‌డీఏతో సంస్థల ప్రతినిధుల చర్చలు

  • జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని సూచనలు

  • 8 నుంచి పనులు ప్రారంభించే ఏర్పాట్లు

  • సంస్థలతో ఎంఏయూడీ అధికారుల చర్చలు

  • మళ్లీ రాజధానికి విచ్చేస్తున్న 45 సంస్థలు

  • 40కి పైగా సంస్థలు సీఆర్‌డీఏతో చర్చలు

  • జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని సూచనలు

  • సోమవారం నుంచి పనులు ప్రారంభించే ఏర్పాట్లు

  • కొన్నిసంస్థలతో ఎంఏయూడీ అధికారుల చర్చలు

విజయవాడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా కాలుమోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి. సోమవారం నుంచి దాదాపు 45 కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూములలో కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే సీఆర్‌డీఏ అధికారులతో టచ్‌లోకి వచ్చాయి. తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశాలపై చర్చిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అమరావతి రాజధానిలో మొత్తం 132 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి.

వీటిలో కేంద్ర సంస్థలు 45 వరకూ ఉన్నాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత అమరావతి విధ్వంసానికి పాల్పడింది. కార్యాలయాల ఏర్పాటు, స్థలాల స్వాధీనం, అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. దీంతో గత ఐదేళ్లు కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించలేకపోయాయి. కొన్ని సంస్థల భూకేటాయింపులను రద్దు చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది. ఆయా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పడంతో వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో సంస్థలకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టింది.


టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో.. సుమారు 40 సంస్థలు మళ్లీ సీఆర్‌డీఏ అధికారులను సంప్రదిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో కూడా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఏయూడీ) అధికారులు మిగిలిన సంస్థలకు ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో సీఆర్‌డీఏ అధికారులు కూడా ఆయా సంస్థలతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో కూడా కేంద్ర సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆ వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఆయా సంస్థలకు యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు అందాయి. దీంతో గురువారం సాయంత్రమే కేంద్ర సంస్థల నుంచి సీఆర్‌డీఏ అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. దాదాపుగా అన్ని కేంద్ర సంస్థల నుంచి సానుకూలత, సుముఖత వ్యక్తమైంది. సోమవారం నుంచి తమ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా చర్యలు చేపడతామని ఆయా సంస్థలు సీఆర్‌డీఏకు తెలిపాయి. తమకు కేటాయించిన స్థలాలలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి పెట్టాల్సిందిగా కొన్ని సంస్థలు సీఆర్‌డీఏను కోరాయి.

Updated Date - Jul 05 , 2024 | 08:59 AM