Share News

TDP Leader Budda Venkanna : విజయసాయిరెడ్డిపై కేసు పెట్టండి

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:44 AM

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టానుసారంగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబును కోరారు.

TDP Leader Budda Venkanna : విజయసాయిరెడ్డిపై కేసు పెట్టండి

  • విజయవాడ సీపీకి బుద్దా వెంకన్న ఫిర్యాదు

విజయవాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టానుసారంగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబును కోరారు. ఈ మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. ‘విజయసాయిరెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నీకు సిగ్గు, శరం ఏమాత్రం ఉన్నా మనిషిగా వ్యవహరించు. మేము అధికారంలోకి రాగానే.. అప్పటికి చంద్రబాబు బతికుంటే జైల్లో వేస్తామని బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేస్తే భయపడిపోతారా? కాకినాడ పోర్టును జగన్‌ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా? కేవీ రావు దగ్గర ఎలా తీసుకున్నారో చెప్పగలరా? 2019 నుంచి వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. కేవీ రావు ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతావా? జగన్‌ తప్పు చేయలేదని, కాకినాడ పోర్టులో వాటాలను లాక్కోలేదని నిరూపించే దమ్ము ఉందా? మీ తప్పులు, పాపాలను ఎత్తి చూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా’ అని నిలదీశారు.

గతంలో ఎక్స్‌లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారని, ఇప్పటి వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు. సీఎంగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పరువునష్టం దావా వేయడానికి అసలు విజయసాయిరెడ్డికి పరువు ఉందా.. అని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో న్యాయ పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Dec 09 , 2024 | 03:44 AM