AP Govt: ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు
ABN , Publish Date - Aug 02 , 2024 | 04:03 PM
భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం.
విశాఖపట్నం: భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది వీఎంఆర్‌డీఏ అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లే అవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. అయినా, ఇప్పటికీ తవ్వకాలను వైసీపీ నేతలు కొనసాగిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఎర్రమట్టి దిబ్బల అక్రమణలు చేశారని ఫిర్యాదులు వస్తుండటంతో మైనింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది.
వెలుగులోకి అక్రమాలు..
జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఎర్ర మట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని.. ఈ పనులను వెంటనే అడ్డుకోవాలని విశాఖ జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (CRZ) జోన్-1 సున్నితమైన పరిధిలోకి వస్తుందని జూలై 18న మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా నేరెళ్ల వలస గ్రామంలోని భూమిలో ఆక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగు సొసైటీ 278.95 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్లు మూర్తి యాదవ్ మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ లే ఔట్ పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చిచెప్పారు. సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారులు వేగంగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966ను సదరు సంస్థ ఉల్లంఘించిందని అధికారులు గుర్తించారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ బిల్డింగు సొసైటీపై చట్ట పరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని మైనింగ్ అధికారులు షో కాజ్ నోటీసులో పేర్కొన్నారు.
ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు..
భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. భీమిలి హౌస్ బిల్డింగ్ సొసైటీ పనులు చేపడుతున్న ప్రాంతం సీఆర్‌జడ్ పరిధిలోకి వస్తుందని గుర్తించిన కలెక్టర్ హరీంధిర ప్రసాద్...కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ కమిటీలో ఉన్న పలు శాఖల అధికారుల నుంచి నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో గనుల శాఖ శుక్రవారం సొసైటీ పనులు చేపట్టిన ప్రాంతానికి వెళ్లినా వర్షం కారణంగా సర్వే ప్రారంభం కాలేదు. సొసైటీ లేఅవుట్‌కు జీవీఎంసీ అనుమతి ఇచ్చే ముందు సీఆర్‌జడ్ అనుమతి ఉండాలి. అయితే సీఆర్‌జడ్ అనుమతి లేనందున సంబంధిత శాఖలు త్వరలో సమావేశమై ఒక నివేదిక రూపొందించే పనిలో ఉన్నాయి.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన ప్రభుత్వం
ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతంలో సుమారు 250 ఎకరాలను భౌగోళిక వారసత్వ సంపదగా 2016లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికంటే ముందు కొంత ప్రాంతం ఐఎన్‌ఎస్‌కు కళింగకు కేటాయించగా, కొంతమంది స్థానికులు కొద్దిభూమి ఆక్రమించుకున్నారు. కాగా, భీమిలి హౌసింగ్ సొసైటీకి గతంలో ప్రభుత్వం కేటాయించిన 373.95 ఎకరాల్లో 91.5 ఎకరాలు కూడా భౌగోళిక వారసత్వ సంపద కింద ప్రకటించిన భూమిలో ఉంది. అందువల్ల 91.5 ఎకరాలను మినహాయించి మిగిలిన 280.7 ఎకరాలు సొసైటీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో సొసైటీ పెట్టుకున్న దరఖాస్తు మేరకు 240.472 ఎకరాలకు తాత్కాలిక లేఅవుట్‌కు జీవీఎంసీ గత ఏడాది ఏప్రిల్ 10న ఆమోదం తెలిపినా పలు అనుమతులు రాలేదు. అయినా పనులు కొనసాగించడంతో ‘ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. జాయింట్ కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి సొసైటీ పనులను నిలిపివేయాలని ఆదేశించారు. అసలు ఆ లేఅవుట్‌కు సీఆర్‌జడ్ అనుమతి ఇవ్వాలంటే కలెక్టర్ అధ్యక్షతన కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ కమిటీలో చర్చించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖకు సిఫారసు చేయాలి.
ఆక్రమణల భూములు స్వాధీనానికి చర్యలు..
కానీ అటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు. ఇదిలావుండగా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన 250 ఎకరాలకు సరిహద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ లేదా సరిహద్దులు తెలిపేలా స్తంభాలు ఏర్పాటుచేస్తే వివాదాలకు తెరపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా త్వరలో సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని భావిస్తున్నారు. అనంతరం పలువురి ఆక్రమణలో ఉన్న భూములు స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఐఎన్‌ఎస్ కళింగకు ఇచ్చిన భూమి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని దానిని తప్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భీమిలి సొసైటీకి ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుని ప్రత్యామ్నాయంగా మరోచోట ఇస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. భూమి వివాదంలో సొసైటీ సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతులు పొందిన విషయాన్ని జిల్లా యంత్రాంగం పరిగణనలోకి తీసుకుని అటు సొసైటీకి ఇబ్బంది లేకుండా ఇటు భౌగోళిక వారసత్వ సంపదకు ప్రమాదం వాటిల్లికుండా ఎలా ముందుకువెళ్లానే అంశంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
PawanKalyan: పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారు...
Atchannaidu: తక్షణమే రైతులకు బిందు సేద్యం అందించండి...
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం
Atchannaidu: తక్షణమే రైతులకు బిందు సేద్యం అందించండి...
Read Latest AP News And Telugu News