Visakha: ఆ భూముల్లో 12 వేల మంది అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారు: మంత్రి ఆనం..
ABN , Publish Date - Dec 15 , 2024 | 09:56 PM
సింహాచలం దేవస్థానం భూముల్లో ఇప్పటికే 12 వేల మందికి పైగా ఆక్రమణదారులు నివాసాలు కట్టుకున్నారని మంత్రి ఆనం తెలిపారు. వారికి ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన చెప్పారు. దేవస్థానం భూముల సమస్య న్యాయస్థానం ఆమోదంతో త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ: సింహాద్రి అప్పన్న ఆలయ భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. పంచ గ్రామాల భూ సమస్యపై స్థానిక ఎమ్మెల్యేలతోపాటు సింహాచలం (Simhachalam) ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju)తో చర్చించినట్లు మంత్రి ఆనం చెప్పారు. విశాఖపట్నానికి ముఖ్యమైన పని నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనను పంపించినట్లు మంత్రి ఆనం వెల్లడించారు.
ఆ భూములు వారికే..
దేవస్థానం భూముల్లో ఇప్పటికే 12 వేల మందికి పైగా ఆక్రమణదారులు నివాసాలు కట్టుకున్నారని మంత్రి తెలిపారు. వారికి ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన చెప్పారు. దేవస్థానం భూముల సమస్య న్యాయస్థానం ఆమోదంతో త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని ఆనం దర్శించుకున్నారు. సింహగిరి చేరుకున్న మంత్రికి పూర్ణకుంభంతో దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. మంత్రి ఆనం కప్పస్తం ఆలింగం అనంతరం స్వామివారి అంతరాలయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం స్వామివారి ప్రసాదాన్ని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి త్రినాధరావు మంత్రి ఆనంకు అందజేశారు.
ప్రజాధనం వృథా..
సింహాచలం, మాన్సాస్ ట్రస్టు భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో రుషికొండ భవనాల నిర్మాణం ఓ పిచ్చిపనంటూ ఆయన మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం చేసి దేనికీ పనికి రాకుండా భవనాలు కట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో పెద్దఎత్తున ప్రజాధనం వృథా చేశారంటూ గజపతిరాజు మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో ఏపీ సచివాలయాన్ని నిర్మిస్తే జగన్ దాన్ని రూ.375 కోట్లకు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలన అంతా సైకో పాలనేనని గజపతిరాజు ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Kakinada: ఓ ఇంటి స్థల వివాదం ఎంత పని చేసిందంటే.. సంచలనం రేపుతున్న ఘటన..
CM Chandrababu: వారివి అన్నీ దొంగ బుద్దులే.. అన్నీ దొంగ నాటకాలే: సీఎం చంద్రబాబు..
Budda Venkanna: జీతాలు తీసుకుంటూ గొర్రెలు కాస్తున్నారా.. ఆ ఎమ్మెల్యేలపై బుద్దా ఫైర్..