Share News

Minister Kandula Durgesh : జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:47 PM

విశాఖపట్నంలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. బీచ్ రోడ్డులో ఉన్న టూరిజం యాత్రి నివాస్‌ని సందర్శించారు. జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

Minister Kandula Durgesh :  జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

విశాఖపట్నం: విశాఖపట్నంలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. బీచ్ రోడ్డులో ఉన్న టూరిజం యాత్రి నివాస్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారించడంతో పర్యాటక శాఖ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు.


విశాఖలోని యాత్రి నివాస్ నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ముందు కొత్త టెండర్ పిలిచి తర్వాత, టెండర్ ఏం లేకుండా పనులు చేయమన్నారని గుర్తుచేశారు. అసలు ఏం జరిగిందనే విషయంపై సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ఏపీలో చాలా ప్రాజెక్టులు పునర్నిర్మాణం పేరుతో నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయని అన్నారు. వైసీపీ చర్యలతో పర్యాటక రంగం ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.


ఎంవీ మా షిప్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మాటిచ్చారు. దీనికి సంబంధించి కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.ఈ విషయంపై కేంద్రంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ మాట్లాడారని.. సరిచేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అనంతరం విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్, అరకు ప్రాంత సందర్శనకు మంత్రి దుర్గేష్ వెళ్లారు.


గాజువాకలో మానవహారం ..

విశాఖపట్నం: ఉక్కు పరిరక్షణ సమితి పోరాట కమిటీ ఆధ్వర్యంలో గాజువాకలో మానవహారం జరిగింది. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మానవహారంలో ఉక్కు కార్మికులు, నిర్వాసితులు, వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసహకరించుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - Oct 06 , 2024 | 01:14 PM