Eluru: ఈనెల 16 సీఎం పర్యటన.. అప్రమత్తమైన అధికారులు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:17 PM
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఏలూరు: పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 16న (సోమవారం) సందర్శించనున్నారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళ్లనున్నారు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. కాగా, తాజాగా మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.
అయితే ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకోనున్నారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అధికారులు అప్రమత్తం..
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సిబ్బందికి పలు సూచనలు చేశారు. చంద్రబాబు వచ్చిన సమయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. కాగా, సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీలతోపాటు స్థానిక అధికారులు, ఎంఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు.