Share News

Hyderabad: మల్కాజిగిరి..హోరాహోరీ..

ABN , Publish Date - May 07 , 2024 | 05:16 AM

తమ సిటింగ్‌ స్థానమని అధికార కాంగ్రెస్‌, ఎమ్మెల్యేలంతా తమ వాళ్లేనని బీఆర్‌ఎస్‌, ప్రధాని మోదీ ఇమేజ్‌ కలిసివస్తుందని బీజేపీ.. ఇలా ఎవరికి వారు మల్కాజిగిరిలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు.

Hyderabad: మల్కాజిగిరి..హోరాహోరీ..

  • దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ స్థానంలో ప్రధాన పార్టీల ముక్కోణపు పోరు

  • అగ్రనేతలతో ప్రచారంలోనూ పోటాపోటీ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

  • మోదీ రోడ్‌షోతో బీజేపీలో జోష్‌.. అన్నీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే

  • ప్రతిష్ఠాత్మక పోరులో ఎవరి ధీమా వారిదే

(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ)

తమ సిటింగ్‌ స్థానమని అధికార కాంగ్రెస్‌, ఎమ్మెల్యేలంతా తమ వాళ్లేనని బీఆర్‌ఎస్‌, ప్రధాని మోదీ ఇమేజ్‌ కలిసివస్తుందని బీజేపీ.. ఇలా ఎవరికి వారు మల్కాజిగిరిలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు. పునర్విభజనలో భాగంగా 2009లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ఏర్పడింది. కాంగ్రెస్‌ తరఫున సర్వే సత్యనారాయణ గెలిచారు. 2014లో చామకూర మల్లారెడ్డి (టీడీపీ) విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కాగా, ఇప్పటివరకు ఇక్కడ బోణీ కొట్టని బీజేపీ, బీఆర్‌ఎస్‌.. ఈసారి ఎలాగైనా గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లనూ బీఆర్‌ఎస్సే గెలుచుకున్నా.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవం ఆ పార్టీని వెంటాడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని అన్ని సెగ్మెంట్లూ గులాబీ ఖాతాలోకే చేరినా.. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుమారు 11 వేల ఓట్లతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై గెలుపొందారు. అయితే, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తాను లోకల్‌ అని, మిగిలిన అభ్యర్థులు నాన్‌ లోకల్‌ అని స్థానికతను తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు దీనిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.


ఈటల రాజేందర్‌ అభ్యర్థి కావడంతో..

బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌ పోటీ చేస్తుండడం ఆ పార్టీకి ప్లస్‌ పాయింట్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈటల బీఆర్‌ఎ్‌సలో ఉండడంతో పాటు, మంత్రిగానూ పనిచేశారు. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్‌.. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. అక్కడ బండి సంజయ్‌ ఎంపీగా ఉండడంతో ఈటల మల్కాజిగిరికి వచ్చారు. శామీర్‌పేటలో ఉంటున్నానని, అంతకుముందు అల్వాల్‌లో పదేళ్లకుపైగా నివసించానని, ఇవి మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోనివేనని చెబుతున్నారు. కాగా, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీకి పట్టుండడం, కొన్నిచోట్ల బీఆర్‌ఎ్‌సలో తన వెంట ఉన్న అనుచరులు, కులసంఘాల నేతల పరిచయాలు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఈటలకు మద్దతుగా ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించారు. కొన్ని సెగ్మెంట్లలోనే పార్టీ బలంగా ఉన్నా.. దేశంలో మోదీ గాలి వీస్తోందని, అదే తమను గెలిపిస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


ఎమ్మెల్యేల బలంతో గెలుస్తామని..

రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన నాయకుడు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి చెందిన రాగిడి.. మూడు దశాబ్దాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. రెండున్నర దశాబ్దాలు కాంగ్రె్‌సలో ఉన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో గులాబీ గూటికి చేరారు. తల్లి మధురమ్మ పేరిట మధుర చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 7 శాసనసభ స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవడం తనకు కలిసి వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత అకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇతర నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేలు రాగిడికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఉప్పల్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌ మినహా ఇతర అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలతో పెద్దగా పరిచయం లేకపోవడం రాగిడికి కొంత ప్రతికూలంగా మారే అవకాశముందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య అన్న అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో స్థానిక పార్టీగా ప్రజలను ఆయన ఎంతమేరకు ఒప్పించి ఆదరణ పొందుతారో చూడాల్సి ఉంది.


సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డికి ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. చేవెళ్లలో పోటీ చేయాలని భావించినా, అధిష్ఠానం నిర్ణయంతో మల్కాజిగిరి బరిలోకి దిగారు. పార్టీ అధికారంలో ఉండడం, సిటింగ్‌ స్థానం కావడం తమకు సానుకూలాంశమని భావిస్తున్నారు. 2019లో ఇక్కడినుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో.. అభ్యర్థి గెలుపుపై పట్టుదలగా ఉన్నారు. పలుమార్లు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని నేతలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, కేడర్‌ను సమన్వయం చేసే పరిస్థితి లేకపోవడం కొంత ప్రతికూలంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్నం కుటుంబం.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనప్పటికీ మల్కాజిగిరి రాజకీయంగా వారికి కొంతమేరకు కొత్తే. దీనిని అధిగమించేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు.

దేశంలోనే అత్యధిక మంది ఓటర్లు ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గం. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది నుంచి కూడా పెద్దసంఖ్యలో ప్రజలు ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వచ్చి స్థిరపడ్డ ప్రాంతం. భిన్న సామాజికవర్గాలు, సంస్కృతులతో మినీ ఇండియాను తలపించే సమాజం. ఎల్‌బీనగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు విస్తరించి.. ప్రత్యేకతలతో కూడిన మల్కాజిగిరిలో ఎన్నిక కూడా ప్రత్యేకమే. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు సాగుతోంది.

Updated Date - May 07 , 2024 | 05:16 AM