Packet Milk: ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగిస్తే జరిగేది ఇదే..
ABN , Publish Date - Sep 16 , 2024 | 07:20 AM
ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగిస్తే అందులోని పోషకాలు, విటమిన్లు నశిస్తాయని డైటీషియన్లు చెప్తున్నారు. అందుకే వాటిని కేవలం ఐదు నిమిషాలపాటు మాత్రమే వేడి చేసి తీసుకోవాలని చెప్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాలను చాలా మంది ఇష్టంగా తాగుతారు. ఒకప్పుడు నేరుగా గెదేలు, ఆవులు ఉన్న వారింటికి వెళ్లి పాలు తెచ్చుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. గ్రామాల్లోకి సైతం పాల ప్యాకెట్లు వచ్చాయి. ఇక పట్టణాలు, నగరాల విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం ప్యాకెట్ పాలు పటిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి ప్యాకెట్ పాలను ఎంత సేపు మరిగించాలో మీకు తెలుసా. ఎక్కువ సేపు మరిగిస్తే జరిగే అనర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలలో అనేక పోషకాలు..
పాలలో అనేక పోషక విలువలు ఉంటాయని మనకు తెలుసు. ఇందులో ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢంగా చేస్తుంది. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రతిరోజూ ఒక గ్లాసు చొప్పున కుటుంబసభ్యులు ఇస్తుంటారు. దీంట్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్యాకెట్ పాలు వాడే వారు వాటిని ఎక్కువ సేపు మరిగించకూడదని డైటీషియన్లు చెప్తున్నారు. అలా మరిగించడం వల్ల వాటిలోని పోషకాలు, విటమిన్లు నశిస్తాయని చెప్తున్నారు.
ఎక్కువ సేపు మరిగిస్తే ఏం జరుగుతుంది?
పాలను ప్యాక్ చేయడానికి ముందు పాశ్చరైజ్ చేస్తారు. అంటే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తారు. ఆ తర్వాత వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు అనువుగా మారుస్తారు. ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు 71డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లబరిచిన పాలను మళ్లీ మనం అతిగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు చెప్తున్నారు.
ఐదు నిమిషాలకు మించి వద్దు..
అందుకే ప్యాకెట్ పాలను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు పొయ్యి మీద పెట్టి ఇతరత్రా పనులు చేయవద్దు. అక్కడే ఉండి ఐదు నిమిషాలపాటు వేడి చేస్తే సరిపోతుంది. ఐదు నిమిషాలకు మించి వాటిని వేడి చేయవద్దు. అంతేకాకుండా ఏ రోజు ప్యాకెట్ పాలను ఆ రోజే వాడుకోవడం మంచిది.