Share News

Farmers Protest: రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న మూడో రౌండ్ చర్చలు..ఫలించేనా!

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:46 PM

రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు.

Farmers Protest: రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న మూడో రౌండ్ చర్చలు..ఫలించేనా!

రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. పంటలకు MSP చట్టం, రుణమాఫీ సహా తమ వివిధ డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా 'ఢిల్లీ చలో' ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. ఆ క్రమంలో హర్యానా, పంజాబ్‌ సరిహద్దుల్లో చేస్తున్న నిరసనలు మరింత వ్యాపించాయి. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయా ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఫిబ్రవరి 17 వరకు పొడిగించింది.


ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకున్నారు. మంత్రులు, నిరసన రైతు సంఘాల నేతల మధ్య మూడో రౌండ్ సమావేశానికి హాజరయ్యేందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వచ్చారు. పంజాబ్, హర్యానా రెండు సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనకారులు, భద్రతా సిబ్బంది ప్రతిష్టంభన మధ్య చర్చలు జరుగుతున్నాయి. 17 వ్యవసాయ సంఘాల ప్రతినిధులతో జరుగుతున్న సమావేశంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు.

అయితే ఈ చర్చలు ఫలిస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ చర్చలు విఫలమైతే రేపు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ కింద ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న జిల్లా వ్యాప్తంగా అనధికార బహిరంగ సభలపై గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు నిషేధం విధించారు. రైతు సంఘం సంయుక్త నాయకులు పిలుపునిచ్చిన ప్రతిపాదిత నిరసన ప్రదర్శనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 09:46 PM