Arvind Kejriwal: జైలు నుంచే ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపించవచ్చా? చట్టం ఏమి చెబుతోంది..?
ABN , Publish Date - Mar 22 , 2024 | 03:19 PM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని 'ఆప్' చెబుతోంది. మరోవైపు, నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడ్నించే ఆయన పాలన సాగించవచ్చా అనేదే ప్రశ్న? ఇక్కడ చట్టం ఏమి చెబుతోందనే దానిపై విశ్లేషణ జరుగుతోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని 'ఆప్' చెబుతోంది. మరోవైపు, నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడ్నించే ఆయన పాలన సాగించవచ్చా అనేదే ప్రశ్న? ఇక్కడ చట్టం ఏమి చెబుతోందనే దానిపై విశ్లేషణ జరుగుతోంది.
అరెస్టు నుంచి రక్షణ?
రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం, రాష్ట్రపతి, రాష్ట్ర-కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లకు వారి పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ ఎలాంటి సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరక్కుండా రక్షణ ఉంటుంది. అధికార విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డు ఉండదు. అయితే, ఈ వెలుసుబాటు ప్రధానమంత్రికి కానీ, ముఖ్యమంత్రులకు కానీ లేదు. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనన్న పరిధిలోకే వారు కూడా వస్తారు. అయితే అరెస్టయ్యారనే ఏకైక కారణంగా పదవి నుంచి ఆటోమాటిక్‌గా డిస్‌క్వాలిఫై అవ్వడం ఉండదు.
జైలు నుంచి కేజ్రీవాల్ తన సర్కార్‌ను నడిపించొచ్చా?
జైలులో ఉంటూ తన కార్యాలయ బాధ్యతలను సీఎం నడిపంచడం లాజికల్‌గా ఆచరణ సాధ్యం కాదు. అయితే అలా చేయకూడదనే లీగల్ అడ్డంకులైతే లేవు. చట్టం ప్రకారం, ఏదైనా కేసులో దోషిగా నిర్ధారణ అయితేనే ముఖ్యమంత్రిపై అనర్హత వేటు పడటం లేదా తొలగింపు ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే, అరవింద్ కేజ్రీవాల్ దోషిగా నిరూపణ కాలేదు. ఒక ముఖ్యమంత్రిని రెండు కారణాలపై తొలగించడం జరుగుతుంది. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు కానీ, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అరెస్టుకు ముందు కానీ అరెస్టు తర్వాత కానీ ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా హేమంత్ సోరెన్ వ్యవహారమే ఇందుకు ఒక ఉదాహరణ. హేమంత్ సోరెన్ ఈ ఏడాది జనవరి 31న ఈడీ అరెస్టుకు ముందే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖాండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.