Share News

Arvind Kejriwal: వ్యూహాత్మక అడుగా, రిస్కా.. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయంపై విశ్లేషణ

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:52 PM

ముఖ్యమంత్రి పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది.

Arvind Kejriwal: వ్యూహాత్మక అడుగా, రిస్కా.. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయంపై విశ్లేషణ

ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేశాక ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాజీనామా ప్రకటన చేశారు.

ఏమన్నారంటే..

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనకు సుప్రీం కోర్టులో న్యాయం జరిగిందని, ఇప్పుడు ప్రజాకోర్టులో న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ప్రజాశీర్వాదం లభించాకే సీఎం కుర్చీలో కూర్చుంటా. ఢిల్లీ ప్రజలను అడగాలనుకుంటున్నా. కేజ్రీవాల్ నిర్దోషా, దోషా. ప్రజలకోసం నేను కష్టపడుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయండి.

ప్రధాని మోదీ ప్రభుత్వం.. బీజేపీయేతర ముఖ్యమంత్రులపై అక్రమ కేసులు బనాయిస్తే రాజీనామా చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీయేతర ముఖ్యమంత్రులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. వారిని అరెస్టు చేస్తే రాజీనామాలు చేయవద్దని, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని కోరుతున్నా. ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే నేను ముందుగా రాజీనామా చేయలేదు’’ అని కేజ్రీవాల్ అన్నారు.


ఆప్ భవిష్యత్తు..

ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు మరో రెండు రోజుల్లో ఆప్‌‌నకు చెందిన 60 మంది ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలకు కూడా ఆప్ అధినేత పిలుపునిచ్చారు. నిజానికి దేశ రాజధానిలో ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా.

ఎలక్షన్లు జరిగే వరకు ఆప్ నుంచి మరొకరు ముఖ్యమంత్రి అవుతారు. మరో 2-3 రోజుల్లో సమావేశం నిర్వహించి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తాం. నా నిజాయతీని నిరూపించుకునేందుకు ప్రజల మధ్యకు వెళ్లి మద్దతు కోరతా. వారి నుంచి తీర్పు వచ్చే వరకు ప్రతి ఇంటికి, వీధికి వెళ్తాను, సీఎం కుర్చీలో కూర్చోను" అని కేజ్రీ స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ఆప్ భారీ ఎత్తున ప్రచారాన్ని ప్లాన్ చేస్తోందని కేజ్రీ కామెంట్స్‌తో అర్థమవుతోంది. కేజ్రీవాల్‌తో పాటు, మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా కూడా ఈ ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.


కొరకరాని కొయ్యగా బీజేపీ..

కేజ్రీవాల్ ప్రకటన ఆద్మీ పార్టీకి స్వల్ప ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా రాజకీయ డ్రామా అని ఆరోపిస్తున్న బీజేపీ.. ఢిల్లీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. కేజ్రీ సీఎం పదవి నుంచి తప్పుకోవడం ఆ స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టడం ద్వారా అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జార్ఖండ్‌ రాజకీయాలు. అలాగే ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడం రిస్కే అని చెప్పుకోవచ్చు.

గత కొన్ని నెలలుగా AAP చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. వరుసగా అగ్రనేతలు జైలుపాలవ్వడం, రాజధానిలో వరదలు సహా పలు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై పోరాటం చేస్తున్నాయి. ఇలాంటివన్నీ ఆప్‌నకు తలనొప్పిగా మారాయి. దీనికితోడు నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగితే ప్రచారానికి సైతం ఆప్‌నకు సమయం ఉండదు. దాంతో ఆ పార్టీ భారీగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

For More National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 04:36 PM