Mamata Banerjee : నీట్‌ను రద్దుచేయండి
ABN , Publish Date - Jun 25 , 2024 | 04:59 AM
నీట్‌ను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు.
మెడిసిన్ ప్రవేశాలను రాష్ట్రాలకివ్వండి
ప్రధాని మోదీకి మమత లేఖ
న్యూఢిల్లీ, జూన్ 24: నీట్‌ను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు. నీట్‌ను తొలగించి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా మెడికల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులను ఎంపిక చేసే స్వేచ్ఛను రాష్ట్రాలను అప్పగించే అంశాన్ని పరిశీలించాలని ప్రధానిని కోరారు. తక్షణమే పాత పద్ధతిని పునరుద్ధరించాలని ప్రధానమంత్రిని కోరారు.
కాగా, కోల్‌కతా, జూన్ 24: భారత్, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకాలకు సంబంధించి ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనా మధ్య జరిగిన చర్చలకు కేంద్రం తనను ఆహ్వానించకపోవడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ ప్రమేయం లేకుండా ఇరు దేశాలు నీటి పంపకాలపై చర్చలు జరపడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోమవారం మోదీకి లేఖ రాశారు.
‘పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా, అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా చర్చలు, సంప్రదింపులు జరపడం ఆమోదయోగ్యం కాదు’ అని మమత పేర్కొన్నారు.
తీస్తా నదీ జలాల పరిరక్షణ-నిర్వహణ, 1996 నాటి గంగా జలాల ఒప్పందం పునరుద్ధణ అంశాలపై ఇటీవల మోదీ, హసీనా చర్చలు జరిపారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో సాంకేతిక బృందాన్ని బంగ్లాదేశ్‌కు పంపనున్నట్టు తెలిపారు. ఒప్పందం ప్రకారం తీస్తా జలాల పరిరక్షణ, నిర్వహణకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పెద్ద రిజర్వాయర్‌ను నిర్మించడానికి భారత్ సిద్ధంగా ఉంది. అయితే భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య నీటి పంపకాల ఒప్పందాన్ని చాలాకాలంగా మమత వ్యతిరేకిస్తున్నారు.