Share News

Bengaluru : డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:03 AM

అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

Bengaluru : డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌.. దానికి అనుబంధంగా ఈడీ సమన్లు

  • వీటిపై గతంలో కర్ణాటక హైకోర్టుకు డీకే

  • సమన్ల రద్దుకు నిరాకరించిన ధర్మాసనం

  • హైకోర్టు నిర్ణయంలో జోక్యానికి

  • సుప్రీంకోర్టు నో.. పిటిషన్‌ కొట్టివేత

బెంగళూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో డీకే శివకుమార్‌ కేసులను ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అనుబంధంగా ఈడీ జారీ చేసిన సమన్లను ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో డీకే శివకుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. డీకే శివకుమార్‌ను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబరు 25న అనుమతులు ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆయనపై 2020 అక్టోబరు 3న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.


ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుపై ప్రభుత్వ అనుమతులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో సీబీఐ దర్యాప్తు నుంచి విముక్తి లభిస్తుందని భావించారు. కానీ అప్పటికే అక్రమ ఆస్తులను నిర్ధారించిన ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా, రాజ్యసభలో మెజారిటీ లేకపోయినప్పటికీ మోదీ సర్కారు ఆధార్‌ చట్టం వంటి కీలక బిల్లులను ద్రవ్య బిల్లుల ముసుగులో ఆమోదింపజేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ అంశం ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం విచారణ జాబితాలో ఉందని, దీన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించి, రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కపిల్‌ సిబల్‌ కోరారు. స్పందించిన సీజేఐ.. రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేసిన వెంటనే తెలియజేస్తానని చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీలో ‘ఏఐ కెమెరా’

కర్ణాటక శాసనసభలో ఎమ్మెల్యేల హాజరు, రాకపోకలను రికార్డు చేసేందుకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కెమెరాలను అమర్చారు. శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు ఏ సమయానికి సభలో ప్రవేశిస్తున్నారు, ఎంత సేపటికి బయటకు వెళ్తున్నారనే వివరాలను ఈ కెమెరాలు రికార్డు చేయనున్నాయి. ఎమ్మెల్యేలు ఎంతసమయం శాసనసభలో గడుపుతున్నారనేది వీటిలో రికార్డు కానుంది.

Updated Date - Jul 16 , 2024 | 04:03 AM