Share News

Ayodhya: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ప్రతినిధి బృందం

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:13 PM

అయోధ్యలో పన్నెండేళ్ల మైనర్ బాలికపై ఆత్యాచార ఉదంతం వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారంనాడు పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Ayodhya: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ప్రతినిధి బృందం
Ayodhya Harassment case

లక్నో, ఆగష్టు 03: అయోధ్య (Ayodhya)లో పన్నెండేళ్ల మైనర్ బాలికపై ఆత్యాచార ఉదంతం వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ (BJP) ప్రతినిధి బృందం ఆదివారంనాడు పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో యోగి సర్కార్ ఆదేశాలతో రాజ్యసభ ఎంపీ బాబూరామ్ నిషాద్, రాష్ట్ర మంత్రి నరేంద్ర కస్యప్‌తో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం అయోధ్యకు వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించింది. దీనిపై ఒక నివేదకను కూడా పార్టీ అధిష్టానానికి ప్రతినిధి బృందం అందజేయనుంది.


బాధితురాలి కుటుంబాన్ని యోగి ఆదిత్యనాథ్ సైతం శుక్రవారంనాడు పరామర్శించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో సీఎం తెలిపారు. అయోధ్యకు చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్ అమిత్ సింగ్ చౌహాన్, బికాపూర్ ఎమ్మెల్యే‌ను తాను కలుసున్నట్టు చెప్పారు. 'బ్లర్' చేసిన బాధిత కుటుంబసభ్యుల ఫోటోలను షేర్ చేశారు. దుండగులను ఎట్టి పరిస్థితిల్లోనూ విడిచిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు.


సమాజ్‌వాదీ పార్టీ ఖండన..

కాగా, అత్యాచార ఘటన బాధాకరమని, సిగ్గుచేటని అసెంబ్లీలో విపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అవదేశ్ ప్రసాద్ చెప్పారు. ఘటనలో ప్రమేయమున్న వారిని విచారించాలని, నిజం బయటకు రావాలని, అమాయకులను కేసులో ఇరికించరాదని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనని, తమ పార్టీ పూర్తిగా బాధితురాలికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, అమాయకులపై కేసులు పెట్టరాదని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. నేరగాళ్లను దగ్గరకు చేర్చడం, వారికి సాయం చేయడం తామెప్పుడూ చేయలేదని అన్నారు. నిందితుడితో ఫోటోపై అడిగినప్పుడు, లక్షలాది మంది తమతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటారని, బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడరాదని అన్నారు.


అసెంబ్లీలో సీఎం ఏమన్నారంటే..

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మొయిద్ ఖాన్ ఉన్నాడని, అయోధ్య ఎంపీల టీమ్‌లో కూడా అతను సభ్యుడని అసెంబ్లీలో మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అతని ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని, సమాజ్‌వాదీ పార్టీ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు.


పోలీస్ యాక్షన్..

కాగా, బేకరీ యజమాని అయిన మొయిన్ ఖాన్‌ను, అతని ఉద్యోగి రాజు ఖాన్‌ను జూలై 30న పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరూ రెండు నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిపారని, దానిని రికార్డు కూడా చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో అత్యాచార బాధితురాలు గర్భిణి అని తేలడంతో ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - Aug 03 , 2024 | 05:13 PM