Aliya Fakhri Arrest: బాలీవుడ్ నటి సోదరి అరెస్టు.. వివరాలు ఇవే..
ABN , Publish Date - Dec 03 , 2024 | 11:16 AM
అలియా, జాకబ్ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం ఆమెకు జాకబ్ బ్రేకప్ చెప్పాడు. అప్పట్నుంచి అతను ఎటినీ అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు.
న్యూయార్క్: బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ(43)ని అమెరికా న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్ (35), అతని ప్రేయసి ఎటినీ(33)ని హత్య చేసిన కేసులో అలియా ఫక్రీని పోలీసులు అరెస్టు చేశారు. అలియా, జాకబ్ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం ఆమెకు జాకబ్ బ్రేకప్ చెప్పాడు. అప్పట్నుంచి అతను ఎటినీ అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే అలియా మాత్రం మాజీ ప్రియుడిని వదులుకోలేకపోయింది. వారిద్దరి ప్రేమను తట్టుకోలేకపోయింది. కోపంతో రగిలిపోయిన అలియా నవంబర్ 2న క్వీన్స్ ప్రాంతంలో జాకబ్, ఎటినీ ఇద్దరు కలిసి ఉండగా.. వారు ఉన్న రెండస్థుల గ్యారేజీని తగలబెట్టింది. గట్టిగా కేకలు వేస్తూ రెచ్చిపోయింది. "ఈ రోజు మీరు నా చేతుల్లో చచ్చారంటూ" అరుస్తూ పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఇదే విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేపట్టిన అలియాను అరెస్టు చేశారు.
అనంతరం అలియా ఫక్రీని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ మిలిందా కట్జ్ నిందితురాలికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇద్దరి వ్యక్తుల మృతికి అలియా కారణం అయ్యిందని న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. మృతులు జాకబ్, ఎటినీ.. పొగ, తీవ్రవైన మంటలు కారణంగా మృతిచెందారని చెప్పారు. మరోవైపు తన కుమార్తె ఎటువంటి తప్పూ చేయలేదని అలియా తల్లి న్యూయార్క్ మీడియాకు తెలిపారు. ఇతరులకు సహాయం చేసే స్వభావం తనదని, ఇలా మరొకరిని చంపేసే మనస్తత్వం తన కుమార్తెది కాదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రమాద సమయంలో పొగను గుర్తించి తాము భవనం నుంచి బయటకు పరుగులు తీశామని స్థానికుడు తెలిపాడు. అయితే మెట్లు మెుత్తం మంటలు వ్యాపించడంతో పైనుంచి దూకెసినట్లు అతను చెప్పాడు.
తనతోపాటు జాకబ్ ప్రేయసి ఎటినీ కూడా దూకేసిందని అతని వెల్లడించాడు. కానీ జాకబ్ లోపలే ఉండిపోవడంతో ఆమె గ్యారెజ్ లోపలికి వెళ్లినట్లు చెప్పాడు. అయితే వారిద్దరూ ఇక తిరిగి రాలేదని తెలిపాడు. ఆ రోజు ఉదయం అలియా అక్కడికి వచ్చి గొడవ చేసినట్లు అతని చెప్పాడు. తాను జాకబ్‌తో ప్రేమలో ఉన్నానని, వారిద్దరూ కలిసి ఉండటాన్ని ఒప్పుకోనంటూ ఆమె గట్టిగా అరిచినట్లు అతను చెప్పాడు. వాళ్ల ఇద్దరినీ చంపేస్తానంటూ అలియా హడావిడి చేసి వెళ్లిందని స్థానికుడు తెలిపాడు. ఆమె చెప్పినట్లుగానే వారిని హతమార్చిందని వెల్లడించాడు. స్థానికుల సమాచారం మేరకు అలియాను పోలీసులు అరెస్టు చేశారు.